Narendra Modi: పాలమూరు వచ్చిన ప్రధాని... రూ.13,545 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం

  • మహబూబ్ నగర్ జిల్లాకు విచ్చేసిన ప్రధాని మోదీ
  • పాలమూరు గర్జన సభకు హాజరు
  • తెలంగాణకు గిరిజన విశ్వవిద్యాలయం కేటాయిస్తున్నట్టు ప్రకటన
  • దేశంలోని ఐదు టెక్స్ టైల్ పార్కుల్లో ఒకటి తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడి
Modi attends to Palamuru rally

ప్రధాని నరేంద్ర మోదీ నేడు పాలమూరు జిల్లాకు విచ్చేశారు. ఈ మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న మోదీ అక్కడ్నించి హెలికాప్టర్ లో భూత్పూరు పయనమయ్యారు. పాలమూరు పర్యటన సందర్భంగా ఆయన రూ.13,545 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం అమిస్తాన్ పూర్ శివారులో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు.

దేశంలో పండుగల సీజన్ మొదలైందని అన్నారు. కేంద్రం చేపడుతున్న అభివృద్ధి పనులతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఉపాధి పొందుతారని అన్నారు. తెలంగాణలో నేడు వేల కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. 

తెలంగాణకు సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ మంజూరు చేస్తున్నామని సభాముఖంగా ప్రకటించారు. ఆదివాసీ దేవతలైన సమ్మక్క-సారక్క పేరిట ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని, అందుకోసం రూ.900 కోట్లు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. 

దేశంలో నిర్మించే ఐదు టెక్స్ టైల్ పార్కుల్లో ఒకటి తెలంగాణకు కేటాయించామని ప్రధాని మోదీ తెలిపారు. ఈ టెక్స్ టైల్ పార్క్ హన్మకొండలో నిర్మిస్తున్నట్టు తెలిపారు. దీని ద్వారా వరంగల్, ఖమ్మం జిల్లాల ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని అన్నారు. 

అంతేకాదు, కరోనా సంక్షోభ సమయంలో పసుపు విలువ ఏంటో అందరికీ తెలిసిందని, తెలంగాణ పసుపు రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని మోదీ స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటుతో పసుపు సాగుదారులకు విస్తృత ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.

పాలమూరు సభా వేదిక నుంచి ప్రధాని మోదీ ప్రారంభించిన అభివృద్ధి పనులు ఇవే...

  • వరంగల్-ఖమ్మం-విజయవాడ హైవే పనులకు వర్చువల్ గా శంకుస్థాపన 
  • కృష్ణపట్నం-హైదరాబాద్ మల్టీ ప్రొడక్ట్ పైప్ లైన్ ప్రారంభం
  • రూ.2,457 కోట్లతో నిర్మించిన సూర్యాపేట-ఖమ్మం హైవేకు శ్రీకారం
  • హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భవనాలకు ప్రారంభోత్సవం 
  • జక్లేర్-కృష్ణా కొత్త రైల్వే లైన్ ప్రారంభం
  • కాచిగూడ-రాయచూర్-కాచిగూడ డెమో రైలు ప్రారంభం
  • హసన్-చర్లపల్లి హెచ్ పీసీఎల్ ఎల్పీజీ పైప్ లైన్ జాతికి అంకితం 

More Telugu News