Revanth Reddy: గుమస్తా స్థాయి లేని వారు గ్రూప్ 1 ఉద్యోగులను ఎలా నిర్ధారిస్తారు?: రేవంత్ రెడ్డి

  • దళారులతో టీఎస్పీఎస్సీని నింపేశారంటూ సీఎం కేసీఆర్ పై మండిపడ్డ టీపీసీసీ చీఫ్
  • ఉన్నత విద్యావంతులు ఉండాల్సిన బోర్డులో ఇలాంటి వాళ్లను నియమించారని ఫైర్
  • రాజ్యాంగబద్ద సంస్థను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారని ఆరోపణ
  • నిరుద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశంలో రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
Revanth Reddy Fires on CM Kcr

రాజ్యాంగబద్ధమైన సంస్థ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ను రాజకీయ పునరావాసంగా మార్చేశారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. పదో తరగతి పరీక్షలు నిర్వహించలేరు.. పన్నెండో తరగతి పేపర్లు దిద్దలేరు.. ఎంసెట్ పరీక్షా పత్రాలు అమ్ముకునేవారు.. సింగరేణి ఉద్యోగాలను అమ్ముకునే వారు చివరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను కూడా కలుషితం చేశారని ఆరోపించారు. దళారులుగా వ్యవహరించిన వారిని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన వారిని తీసుకొచ్చి టీఎస్పీఎస్సీలో నియమించారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఉన్నత విద్యావంతులు ఉండాల్సిన స్థానంలో గుమస్తాలుగా కూడా పనికిరాని వారిని కూర్చోబెట్టారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఎస్పీఎస్సీలో అనర్హులను నియమిస్తే ఉద్యోగ నియామకాలను సరిగ్గా నిర్వహించలేరంటూ గతంలోనే ఆందోళనలు జరిగాయని, కోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయని గుర్తుచేశారు.

నిరుద్యోగులు, మేధావులు ఆందోళనలు వ్యక్తం చేసినా సరే ప్రభుత్వం పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాజకీయ అవసరాల కోసం గుమస్తా హోదా కూడా లేనివారిని ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టిందని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితంగా గ్రూప్ 1 రాసిన నిరుద్యోగులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారని చెప్పారు. గ్రూప్ 1 పరీక్ష రెండుసార్లు రద్దయిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. బోర్డులో అనర్హులు ఉండడం వల్ల టీఎస్పీఎస్సీ ఒక్క పరీక్షనూ సక్రమంగా నిర్వహించలేకపోతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.


More Telugu News