YS Jagan: కురుక్షేత్ర యుద్ధం జరగబోతుంది.. ఆలోచించి ఓటేయండి: వైఎస్ జగన్

YS Jagan appeals voters to vote ysrcp in next election
  • మన ప్రభుత్వం వల్ల మీ ఇంట్లో మంచి జరిగిందనిపిస్తే నాకు తోడుగా నిలవాలని పిలుపు
  • నిరుపేదల వైపు నిలిచిన ప్రభుత్వానికి, పేదలను మోసం చేసిన గత ప్రభుత్వానికి యుద్ధమన్న సీఎం
  • గత ప్రభుత్వంలో అన్నింటా దోపిడీ జరిగిందని ఆరోపణ
  • గతంలోను ఇదే బడ్జెట్.. మారింది సీఎం ఒక్కరే, ఈ పథకాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్న
కురుక్షేత్ర యుద్ధం జరగబోతోందని, మన ప్రభుత్వం వల్ల మీ ఇంట్లో మంచి జరిగిందనిపిస్తే మీరంతా నాకు తోడుగా నిలవండని ఏపీ సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. విజయవాడలో వాహనమిత్ర నిధులను శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... త్వరలో కురుక్షేత్ర యుద్ధం జరగనుందన్నారు. నిరుపేదల వైపు నిలిచిన ప్రభుత్వానికి, పేదలను మోసం చేసిన గత ప్రభుత్వానికి యుద్ధం జరగనుందన్నారు. పేదలకు, పెత్తందారులకు జరిగే ఈ యుద్ధంలో మీ కోసం ఆలోచించే తనవైపు ఉండాలన్నారు. గత ప్రభుత్వంలో అమరావతి పేరుతో స్కామ్, స్కిల్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్, ఫైబర్ గ్రిడ్, నీరు-చెట్టు ఇలా ప్రతి దాంట్లో దోపిడీకి తెరలేపారన్నారు. కానీ తాము అధికారంలోకి వచ్చాక 99 శాతం హామీలు అమలు చేశామన్నారు.

మన ప్రభుత్వం వాయిస్ ఆఫ్ ది వాయిస్‌లెస్ అన్నారు. మన ప్రభుత్వం పేదల కోసం పని చేస్తోంటే, మరోవైపు ప్రతిపక్షాలు పేదలను మోసం చేస్తున్నాయన్నారు. గత ప్రభుత్వం తమ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేస్తే, మనం మాత్రం అమలు చేశామన్నారు. లంచాలు, వివక్ష లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదును జమ చేస్తున్నామన్నారు. గతంలోనూ ఇదే బడ్జెట్ ఉందని, కానీ మారిందల్లా ముఖ్యమంత్రి ఒక్కరే అన్నారు. ఇప్పుడు మనం ఇస్తున్నటువంటి పథకాలు గత ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోయిందని ప్రశ్నించారు.

పేదవాడి ప్రభుత్వం కావాలా? పెత్తందారుల ప్రభుత్వం కావాలా? అనేది వచ్చే ఎన్నికల సమయంలో అందరూ ఆలోచించాలన్నారు. వారికి దోచుకోవడానికి, దోచుకున్నది దాచుకోవడానికి, పంచుకోవడానికి అధికారం కావాలని, కానీ మనం పేదల కోసం పని చేస్తామన్నారు. తనకు గజ దొంగల ముఠా అండ అవసరం లేదన్నారు. దత్తపుత్రుడి తోడు తనకు లేదని, దోచుకొని పంచుకోవడం తనకు చేతకాదన్నారు. ఓటు వేసే ముందు మంచి జరిగిందా? లేదా? అని ఆలోచించి ఓటేయాలన్నారు.
YS Jagan
Andhra Pradesh

More Telugu News