credit score: క్రెడిట్ స్కోరు బలంగా ఉండాలంటే ఈ టిప్స్ పాటిస్తే సరి!

  • ఏ రుణానికి అయినా క్రెడిట్ చరిత్ర బాగుండాలి 
  • రుణ చరిత్రను ప్రతిఫలించేదే క్రెడిట్ స్కోరు
  • 750కు పైన క్రెడిట్ స్కోర్ ఉంటే సులభంగా రుణాలు
What is a credit score and ways to build good CIBIL score

రుణం కావాలంటే చెల్లింపుల సామర్థ్యం ఉండాలి. ఒక వ్యక్తి రుణ దరఖాస్తును ఆమోదించే ముందు రుణదాతలు (బ్యాంకులు, ఎన్ బీఎఫ్ సీలు) ప్రధానంగా చూసేది ఇదే. దీని తర్వాత రుణ చరిత్రను పరిగణనలోకి తీసుకుంటారు. గతంలో ఏవైనా రుణాలు తీసుకుని ఉంటే, వాటికి చెల్లింపులు సక్రమంగా చేశారా..? ఎగవేతలు ఉన్నాయా? చెల్లింపుల్లో ఆలస్యం ఉందా? తదితర వివరాలను కీలకంగా చూస్తారు. 

పాన్ నంబర్ల ఆధారంగా ప్రతి వ్యక్తికి సంబంధించి క్రెడిట్ ప్రొఫైల్ ను క్రెడిట్ బ్యూరోలు నిర్వహిస్తుంటాయి. క్రెడిట్ స్కోర్ బలంగా ఉంటే, రుణం చాలా సులభంగా, తక్కువ వడ్డీ రేటుకే లభిస్తుంది. మంచి క్రెడిట్ స్కోరు కోరుకునే వారు కొన్ని చర్యలను ఆచరణలో పెట్టాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఒక వ్యక్తి రుణ చరిత్ర ఎంత మెరుగ్గా ఉందన్నది క్రెడిట్ స్కోర్ చెబుతుంది. 

  • ఒకేసారి ఒకటికి మించి రుణాలకు దరఖాస్తు చేసుకోకూడదు. ఒకసారి ఒక్క రుణానికే పరిమితం కావాలి. కొంత విరామం తర్వాత కావాలంటే మరొకటి తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది క్రెడిట్ స్కోరును ప్రభావితం చేస్తుంది. 
  • క్రెడిట్ కార్డుల లిమిట్ ను పెంచుకోవాలంటూ క్రెడిట్ కార్డు సంస్థలు కోరుతుంటాయి. అవసరం ఉంటే తప్ప లిమిట్ ను పెంచుకోకండి. ప్రస్తుతం ఉన్న లిమిట్ (కార్డుపై వినియోగ పరిమితి) చాలనప్పుడే అదనపు లిమిట్ కోసం చూడండి.
  • సిబిల్ స్కోర్ ను ఉచితంగా చూసుకునేందుకు ఎన్నో ఫిన్ టెక్, ఎన్ బీఎఫ్ సీ సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి. ఎందుకంటే ఉచితంగా క్రెడిట్ స్కోరు చూసుకునే అవకాశం ఇవ్వడం ద్వారా, తర్వాత పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తుంటాయి. అనవసరంగా ఊరించి రుణ ఊబిలోకి దింపుతాయి. అందుకని క్రెడిట్ స్కోరు చూసుకోవాలంటే నేరుగా సిబిల్ లేదా మరో క్రెడిట్ బ్యూరో వెబ్ సైట్ కు వెళ్లి చూసుకోవాలి.
  • క్రెడిట్ కార్డు, రుణ ఈఎంఐల చెల్లింపుల్లో వైఫల్యం లేకుండా చూసుకోవాలి. రుణ చెల్లింపుల్లో డిఫాల్ట్ అన్నది క్రెడిట్ స్కోరును గణనీయంగా తగ్గించేస్తుంది. అలాగే క్రెడిట్ కార్డు బకాయిలను పూర్తిగా చెల్లించడానికే ప్రాధాన్యం ఇవ్వాలి. మినిమమ్ డ్యూ వరకే చెల్లించడం కంటే, మొత్తం చెల్లిస్తేనే స్కోరు బాగుంటుంది.
  • 750కు పైన ఉంటే చాలా మంచి స్కోరుగా రుణాలిచ్చే సంస్థలు పరిగణిస్తాయి. వీరికి రుణాలిచ్చేందుకు సంస్థలు ఉత్సాహం చూపిస్తుంటాయి. డిమాండ్ చేస్తే వడ్డీ రేటును కూడా తగ్గిస్తాయి. 650-750 మధ్య ఉంటే దాన్ని కూడా మంచి స్కోరుగానే పరిగణిస్తారు. కాకపోతే వడ్డీ రేటులో తగ్గింపు రాదు. 
  • మెరుగైన క్రెడిట్ స్కోర్ లేని వారు, మంచి స్కోరు ఉన్నవారితో కలసి జాయింట్ గా లోన్ తీసుకుంటే, అప్పుడు తమ స్కోరును పెంచుకోవచ్చు. 

More Telugu News