Gautam Adani: అర్ధరాత్రి గౌతమ్ అదానీ ట్వీట్.. సీఎం జగన్ తో చర్చించిన విషయాల వెల్లడి

Gautam adani tweets about meeting with YS Jagan
  • ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్ నుంచి వచ్చిన గౌతమ్
  • నిన్న సాయంత్రం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జగన్, అదానీ సమావేశం
  • గంగవరం పోర్ట్, వైజాగ్ డేటా సెంటర్‌పై చర్చించినట్టు ట్వీట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ నిన్న రాత్రి భేటీ అయ్యారు. నిన్న సాయంత్రం అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న అదానీ, అక్కడి నుంచి తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఆ తర్వాత పలు అంశాలపై సీఎం జగన్‌తో అదానీ చర్చించినట్లుగా తెలుస్తోంది. క్యాంప్ కార్యాలయంలో రాత్రి విందు తర్వాత అదానీ తిరుగుపయనం అయ్యారు. గౌతమ్ అదానీ, సీఎం జగన్ భేటీ గురించి ముందస్తుగా ఎలాంటి అధికారిక సమాచారం కానీ, భేటీ తర్వాత ప్రకటన కానీ రాలేదు. 

అయితే, తమ భేటీ గురించి అదానీ నిన్న అర్ధరాత్రి 12 గంటలకు ట్వీట్ చేశారు. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో ఎప్పట్లాగే సానుకూల సమావేశం జరిగింది. ఏపీలో అదానీ సంస్థల కీలక పెట్టుబడులు, ముఖ్యంగా గంగవరం పోర్ట్, వైజాగ్ డేటా సెంటర్‌పై చర్చించాం. ఈ ప్రాజెక్టులు అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్‌కు కీలకమని మేం ఇరువురం భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
Gautam Adani
YSRCP
YS Jagan
Andhra Pradesh

More Telugu News