Jogi Ramesh: మంత్రి జోగి రమేశ్ ఫొటోగ్రాఫర్ మిస్సింగ్ కేసులో వీడిన మిస్టరీ

  • నాలుగేళ్లుగా మంత్రి వద్ద ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న ఆదినారాయణ
  • ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెబుతూ ఈ నెల 25న అదృశ్యం
  • క్షమించాలని భార్య, తల్లిదండ్రులకు.. తన భార్యకు ఉద్యోగం ఇప్పించాలని మంత్రికి లేఖలు
  • వ్యసనాల బారినపడి లక్షల్లో అప్పులు
  • తీర్చే మార్గం లేకపోవడంతో ఆత్మహత్య డ్రామా
Minister Jogi Ramesh Photographer missing case salved

ఆత్మహత్య చేసుకుంటున్నట్టు వాట్సాప్ స్టేటస్‌లో ఫొటోలు పెట్టి అదృశ్యమైన మంత్రి జోగి రమేశ్ వ్యక్తిగత ఫొటోగ్రాఫర్ యారగాని ఆదినారాయణ (28) కేసు మొత్తానికి ఓ కొలిక్కి వచ్చింది. అతడు అన్నంత పనీ చేయలేదని, క్షేమంగానే ఉన్నట్టు సీసీటీవీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు. త్వరలోనే అతడిని పట్టుకుంటామని తెలిపారు. 

ఇంతకీ ఏమైందంటే?
మంత్రి వద్ద నాలుగేళ్లుగా ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న ఆదినారాయణ ఈ నెల 25న అదృశ్యమయ్యాడు. ఆపై ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు చెబుతూ ఉల్లిపాలెం వంతెన పైనుంచి ఫొటోలు తీసుకుని వాటిని వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకున్నాడు. అతడి కోసం నదిలో రెండు రోజులపాటు గాలించినప్పటికీ ఆచూకీ లేకపోవడంతో ఏదో తిరకాసు ఉందని పోలీసులు అనుమానించారు. నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటే కనుక 36 గంటల్లోపు మృతదేహం తీరానికి చేరుతుందని, కానీ అలా జరగలేదంటే దీని వెనక ఏదో ఉందని భావించారు.

గుర్తించకుండా మాస్క్ ధరించి
ఉల్లిపాలెం వంతెనపై ఉన్న సీసీకెమెరాలు పనిచేయకపోవడంతో ఆ మార్గంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. సాయంత్రం ఐదు గంటల వేళ చిన్నాపురం వద్ద ఓ సీసీ కెమెరాలో బైక్‌పై వెళ్తున్న ఆదినారాయణను గుర్తించారు. ఆ సమయంలో అతడి వద్ద రెండు బ్యాగులు ఉండడంతోపాటు ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా గుర్తించారు. ఆ తర్వాత కోడూరు బస్టాండ్ సమీపంలో సాయంత్రం 7.15 గంటలకు ఆటో దిగి మరో ఆటో కోసం వెయిట్ చేస్తున్నట్టు అక్కడి సీసీకెమెరాల్లో రికార్డయింది. తనను ఎవరూ గుర్తుపట్టకుండా ముఖానికి మాస్క్ ధరించాడు. 

తప్పుదారి పట్టించేందుకే ఆత్మహత్య డ్రామా
ఇవన్నీ చూసిన పోలీసులు అతడు ఆత్మహత్యకు పాల్పడలేదని, ఉద్దేశపూర్వకంగా మరో ప్రాంతానికి పరారయ్యాడని నిర్ధారించుకున్నారు. ఫోన్‌ను స్విచ్చాఫ్‌లో పెట్టుకున్నప్పటికీ అప్పుడప్పుడు ఆన్‌చేస్తున్నాడు. త్వరలోనే అతడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. అందరినీ తప్పుదోవ పట్టించేందుకు అతడీ ఆత్మహత్య ప్రణాళిక రచించి ఉంటాడని పేర్కొన్నారు.

కోటి రూపాయల అప్పు!
ఇంజినీరింగ్ చదివిన ఆదినారాయణ మంత్రి వద్ద ఫొటోగ్రాఫర్‌గా చేరి విశ్వాసపాత్రుడిగా మారాడు. అయితే, ఆ తర్వాత క్రికెట్ బెట్టింగులు, ఇతర వ్యసనాలకు అలవాటుపడ్డాడు. మంత్రి కార్యాలయంలో పనిచేస్తుండడంతో తెలిసిన వారందరి వద్ద అప్పులు చేసి బెట్టింగులో పెట్టాడు. ఇలా దాదాపు కోటి వరకు అప్పులు చేసినట్టు చెబుతున్నారు. అప్పులు పీకల మీదికి రావడం, తీర్చే మార్గం లేకపోవడంతో పరారు కావాలని అనుకున్నాడు. ఇందుకోసం పక్కా ప్లాన్ రచించాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లవద్దంటూ సూసైడ్ నోట్ రాశాడు. క్షమించాలని తల్లిదండ్రులు, భార్యను కోరాడు. మంత్రికి మరో లేఖ రాసి తన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని కోరాడు.

More Telugu News