Hero Siddharth: కర్ణాటకలో హీరో సిద్ధార్థ్ కు కావేరీ జలాల నిరసన సెగలు... వీడియో ఇదిగో!

  • 'చిత్తా' ప్రమోషన్స్ కోసం బెంగళూరు వెళ్లిన సిద్ధార్థ్
  • సిద్ధార్థ్ ప్రెస్ మీట్ లోకి ప్రవేశించిన కావేరీ జలాల నిరసనకారులు
  • అక్కడ్నించి వెళ్లిపోవాలని సిద్ధార్థ్ ను కోరిన నిరసనకారులు
  • ప్రెస్ మీట్ అంతటితో ఆపేయాలని స్పష్టీకరణ
Hero Siddharth faces heat of Cauvery water protesters

ప్రముఖ హీరో సిద్ధార్థ్ కు కర్ణాటకలో చేదు అనుభవం ఎదురైంది. తన కొత్త చిత్రం 'చిత్తా' ప్రమోషన్ ఈవెంట్స్ లో పాల్గొనేందుకు సిద్ధార్థ్ బెంగళూరు వెళ్లారు. అక్కడ ప్రెస్ మీట్ జరుగుతుండగా, కావేరీ జలాల నిరసన సెగ తగిలింది. 

సిద్ధార్థ్ హాజరైన కార్యక్రమంలో కావేరీ నదీ జలాల ఉద్యమకారులు ప్రవేశించి నినాదాలు చేశారు. సిద్ధార్థ్ అక్కడ్నించి వెళ్లిపోవాలని వారు కోరారు. వెంటనే ఆ ప్రెస్ మీట్ రద్దు చేయాలని, తద్వారా కావేరీ జలాల ఉద్యమానికి మద్దతు తెలపాలని నిర్వాహకులకు తెలిపారు. 

"మేం కావేరీ జలాల కోసం పోరాడుతున్నాం. కావేరీ జలాలు తమిళనాడుకు వెళ్లిపోతున్నాయి. కానీ ఇతడు (సిద్థార్థ్) అక్కడ్నించి వచ్చి తన సినిమాను ఇక్కడ ప్రమోట్ చేసుకుంటున్నాడు... ఇదా మీరు కోరుకుంటున్నది?" అంటూ ఓ నిరసనకారుడు ప్రెస్ మీట్ కు వచ్చినవారిని ప్రశ్నించాడు. 

అయినప్పటికీ సిద్ధార్థ్ కావేరీ జలాల నిరసనకారులను పట్టించుకోకుండా, మీడియాతో మాట్లాడడం కొనసాగించారు. దాంతో, నిరసనకారులు స్పందిస్తూ, మేం ఇక్కడికి బెదిరించడానికి రాలేదు, దయచేసి సహకరించమని అడగడానికి వచ్చాం... ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ఆపేయండి అని విజ్ఞప్తి చేశారు. కాసేపటి తర్వాత సిద్ధార్థ్ మీడియాకు కృతజ్ఞతలు తెలిపి కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. 

కావేరీ నదీ జలాలపై సుదీర్ఘకాలంగా కర్ణాటక తమిళనాడు మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. తమిళనాడులో ఏ ప్రభుత్వం వచ్చినా, తమిళ సినీ నటులంతా ఏకతాటిపైకి వచ్చి కావేరీ వివాదంలో తమ ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నారు.

More Telugu News