K Kavitha: చంద్రబాబు అరెస్ట్, తదనంతర పరిణామాలపై కల్వకుంట్ల కవిత స్పందన

Kalvakuntla Kavitha reaction on Chandrababu arrest
  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • హైదరాబాదులోనూ నిరసనలు
  • అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్... ఎక్కడైనా నిరసన చేసుకోవచ్చన్న రేవంత్
  • రేవంత్ వ్యాఖ్యలను తప్పుబట్టిన కవిత
  • చంద్రబాబు అరెస్ట్ టీడీపీ, వైసీపీ తేల్చుకోవాల్సిన విషయం అని ఉద్ఘాటన 
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ చేయడం, నిరసనలు, తదితర పరిణామాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. చంద్రబాబు ఏపీలో అరెస్ట్ అయితే హైదరాబాదులో నిరసలేంటని మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేయడం, కేటీఆర్ వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి తప్పుబట్టడం వంటి అంశాలపైనా కవిత తన అభిప్రాయాలను పంచుకున్నారు. 

పక్క రాష్ట్రంలోని రాజకీయాలపై ఉన్న శ్రద్ధ వారికి ఇక్కడి రాజకీయాలపై లేకపోవడం శోచనీయం అని రేవంత్ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ దేశం మొత్తానికి రాజధాని కాబట్టి అక్కడ ధర్నాలు చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదని కవిత పేర్కొన్నారు. హైదరాబాదులో ధర్నా చేయాలంటే తెలంగాణ అంశాలపై ధర్నా చేస్తే బాగుంటుందని హితవు పలికారు. 

ఆంధ్రా అంశాలపై ఇక్కడెందుకు ధర్నాలు చేయాలి? అలాంటి కార్యక్రమాలతో హైదరాబాదులో శాంతిభద్రతలకు భంగం వాటిల్లదా? అని మాత్రమే తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారని కవిత స్పష్టం చేశారు. దాన్ని పెద్ద వివాదం చేస్తున్నారని, ఎవరైనా ఎక్కడికైనా రావొచ్చు అంటూ రేవంత్ రెడ్డి అనవసరంగా భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. 

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పరిస్థితులు ఇలాగే ఉంటాయని, ఎప్పుడూ ధర్నాలు, గొడవలు, నిరసనలు, కర్ఫ్యూలు ఉంటాయని, ఆ పార్టీ చరిత్ర అదేనని కవిత ఎద్దేవా చేశారు. పరిస్థితులను బట్టి ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు రాబట్టుకోవాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కవిత విమర్శించారు. 

చంద్రబాబు అరెస్ట్ అంశంపైనా కవిత తన అభిప్రాయాలను స్పష్టం చేశారు. "ఒక రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై పక్క రాష్ట్రంలో చర్చ పెట్టాలనుకోవడం దారుణం. దేశంలో అనేక మంది రాజకీయ నేతలు వేధింపులకు గురవుతుండడడం చూస్తూనే ఉన్నాం. ఇది ఆయా పార్టీలు, వారి న్యాయ విభాగాలు చూసుకోవాల్సిన విషయం. తమ సమస్యను ప్రజల సమస్యగా చెబుతూ ప్రతి ఒక్కరినీ ఏదో ఒక విధంగా టార్గెట్ చేయాలని చూడడం అన్యాయం. ఇది టీడీపీ, వైసీపీ చూసుకోవాల్సిన విషయం" అని కవిత ఉద్ఘాటించారు.
K Kavitha
Chandrababu
Arrest
KTR
Revanth Reddy
Hyderabad
BRS
TDP
YSRCP
Congress
Telangana
Andhra Pradesh

More Telugu News