Punjab: డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్.. ఇండియా కూటమిపై ప్రభావం చూపే అవకాశం!

  • పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుక్పాల్ సింగ్ అరెస్ట్
  • 2015 నాటి కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • పంజాబ్ ప్రభుత్వం ముర్దాబాద్ అంటూ సుక్పాల్ సింగ్ నినాదాలు
Congress MLA in Punjab arrested in drugs case

డ్రగ్స్ స్మగ్లింగ్, మనీ లాండరింగ్ కేసులో పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుక్పాల్ సింగ్ ఖైరాను పోలీసులు అరెస్ట్ చేయడం రాజకీయ దుమారం రేపుతోంది. 2015లో నమోదైన కేసు ఆధారంగా ఈ ఉదయం ఆయన నివాసంలో సోదాలు నిర్వహించారు. అంతర్జాతీయ స్మగ్లర్ల ముఠాకు అండగా ఉండటం, వారికి షెల్టర్ ఇవ్వడం, వారి నుంచి ఆర్థిక లబ్ధి పొందడం వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. స్మగ్లర్ల నుంచి తీసుకున్న డబ్బుతో ఆయన విలువైన ఆస్తులను కొనుగోలు చేశారని విచారణ సంస్థ అభియోగాలు మోపింది. 2014 నుంచి 2020 మధ్య కాలంలో సుక్పాల్ సింగ్ తన కోసం, తన కుటుంబం కోసం రూ. 6.5 కోట్లకు పైగా ఖర్చు చేశారని, ఈ మొత్తం డిక్లరేషన్ లో ఆయన పేర్కొన్న దాని కంటే ఎక్కువని పోలీసులు చెపుతున్నారు. 

మరోవైపు పోలీసులు తన ఇంటికి వచ్చి సోదాలు నిర్వహిస్తుండటాన్ని ఆయన ఫేస్ బుక్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేశారు. ఈ వీడియోలో ఆయన పోలీసులతో వాగ్వాదం చేస్తున్నట్టు ఉంది. డీఎస్పీ అచ్రు రామ్ సింగ్ ఆయనతో మాట్లాడుతూ... పాత డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో సిట్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. పోలీసులు తనను అరెస్ట్ చేసిన వెంటనే... పంజాబ్ ప్రభుత్వం ముర్దాబాద్ అంటూ గట్టిగా నినాదాలు చేశారు. 

కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్ వ్యవహారం ఇండియా కూటమిలో చిచ్చు రాజేసేలా ఉంది. ఈ కూటమిలో కాంగ్రెస్ తో పాటు ఆప్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పంజాబ్ లో ఆప్ ప్రభుత్వం ఉంది.

More Telugu News