amazing welcome: హైదరాబాద్ లో సాదర స్వాగతం.. ఫిదా అయిన పాక్ జట్టు

Babar Azam overwhelmed Mohammad Rizwan Shaheen Afridi react to amazing welcome in India
  • విమానాశ్రయంలో, పార్క్ హయత్ లో ఊహించని రీతిలో ఆహ్వానం
  • మనసు పొంగిపోయిందన్న పాక్ కెప్టెన్ బాబర్ అజామ్
  • ఘన స్వాగతం లభించిందంటూ పాక్ క్రికెట్ బోర్డ్ ట్వీట్
వన్డే ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ జట్టు హైదరాబాద్ కు చేరుకుంది. బుధవారం రాత్రి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న పాకిస్థాన్ క్రికెట్ బృందానికి సాదర స్వాగతం లభించింది. ఎయిర్ పోర్ట్ లో పాకిస్థాన్ క్రికెటర్లను చూసేందుకు అభిమానులు తరలి వచ్చారు. చేతులతో అభివాదం చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎయిర్ పోర్ట్ ఎంట్రీ గేట్ వద్ద పాకిస్థాన్ జట్టు సభ్యుల కోసం ప్రత్యేక బస్సు సిద్ధంగా ఉంచగా, అందరూ ఆ బస్సు ఎక్కి ముందుకు కదిలారు.

పాక్ క్రికెటర్ల బస్సు వెళుతున్నప్పుడు కూడా అద్దాల్లోంచి కనిపిస్తున్న క్రికెటర్లకు అభిమానులు చేతులు ఎత్తి పలకరించారు. అక్కడి నుంచి పార్క్ హయత్ హోటల్ కు వీరి బస్సు చేరుకుంది. అక్కడ కూడా పాక్ క్రికెటర్లకు ఊహించని రీతిలో స్వాగతం లభించింది. హోటల్ సిబ్బంది అంతా దారికి ఇరువైపులా వరుసలో నించుని చప్పట్లు కొడుతూ క్రికెటర్లను ఆహ్వానించారు. శాలువాలను ఒక్కో క్రికెటర్ మెడలో వేసి అభివాదం చేశారు. పాక్ క్రికెటర్ల ఫొటోలతో కూడిన సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు.

పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ సైతం దీనిపై ట్వీట్ చేసింది. ‘‘భారత్ తీరానికి చేరుకున్నాం. హైదరాబాద్ లో ఘన స్వాగతం లభించింది’’ అంటూ ట్వీట్ పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ షేర్ చేసింది. పాకిస్థాన్ క్రికెటర్ షాహీన్ అఫ్రిది, బాబర్ అజామ్ ఫిదా అయ్యారు. అఫ్రిది అయితే ఇన్ స్టా గ్రామ్ లో ‘హైదరాబాద్, ఇండియా. ఇంత వరకు ఘన స్వాగతం’ అంటూ పోస్ట్ పెట్టాడు. వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ ట్విట్టర్లో.. ‘‘ఇక్కడి ప్రజల నుంచి ఆదరణ లభించింది. అంతా సాఫీగా నడిచింది. వచ్చే నెలన్నర కోసం చూస్తున్నాం’’ అని పేర్కొన్నాడు. పాక్ కెప్టెన్ బాబర్ అయితే.. భారత్ లో తమకు లభించిన ప్రేమ, మద్దతుతో మనసు పొంగిపోయినట్టు ఇన్ స్టా గ్రామ్ లో పేర్కొన్నాడు.
amazing welcome
Pakistan
cricket team
Hyderabad
reached

More Telugu News