Google: చేతిలో ఫోన్ ఉంటే చాలు... భూకంపాలను ముందే గుర్తించవచ్చంటున్న గూగుల్

  • ఆండ్రాయిడ్ యూజర్ల కోసం సరికొత్త వ్యవస్థ
  • ఇప్పటికే పలు దేశాల్లో భూకంపాలపై ముందే అప్రమత్తం చేస్తున్న గూగుల్
  • త్వరలో భారత్ లోనూ భూకంప అప్రమత్తత సందేశాలు
Google brings new system to detect earthquakes with android phones

భారత్ లోని ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు భూకంపాలకు సంబంధించి ఇకపై ముందే సందేశాలు అందనున్నాయి. ఈ మేరకు ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు... మీ ఫోన్ ద్వారానే భూకంపాలను గుర్తించవచ్చని గూగుల్ చెబుతోంది. 

ఇప్పటికే పలు దేశాల్లో భూకంపాలపై ముందే అప్రమత్తం చేస్తున్న గూగుల్, మరికొన్నిరోజుల్లో భారత్ లోనూ భూకంప అప్రమత్తత సందేశాలను ఆండ్రాయిడ్ వినియోగదారులకు పంపనుంది. దీనికోసం గూగుల్... ఎన్డీఎంఏ (జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ), ఎన్ఎస్ సీ (నేషలన్ సీస్మాలజీ సెంటర్)తో చేయికలిపింది. 

గూగుల్  ఏర్పాటు చేసిన తాజా వ్యవస్థ భూకంపాలను ముందే పసిగట్టి, ఫోన్లకు అత్యవసర సందేశాలు పంపడం ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తుంది. దాదాపు అన్ని భారతీయ భాషల్లో అలర్ట్స్ పంపనుంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉండే యాక్సెలరోమీటర్ సెన్సర్లు భూకంపాలను గుర్తించే మినీ సీస్మోమీటర్లుగా పనిచేస్తాయని గూగుల్ వెల్లడించింది. 

భూకంపానికి ముందు అత్యధిక సంఖ్యలో ఆండ్రాయిడ్ ఫోన్లలోని యాక్సెలరోమీటర్లు స్పందించినప్పుడు, ఆ సంకేతాలను తమ సర్వర్ సేకరిస్తుందని, వెంటనే ఆ సమాచారం యూజర్లకు అలర్ట్స్ రూపంలో పంపించడం జరుగుతుందని గూగుల్ తెలిపింది. 

ఇంటర్నెట్ సంకేతాలు కాంతివేగంతో సమానంగా పయనిస్తాయని, భూకంప తరంగాల కంటే వేగంగా ప్రయాణిస్తాయని, దాంతో తమ అలర్ట్ ల వల్ల యూజర్లు ముందే భూకంప సమాచారాన్ని అందుకుంటారని వివరించింది. ఆండ్రాయిడ్ 5, ఆపై వెర్షన్ల వారికి ఈ భూకంప అప్రమత్త వ్యవస్థ అందుబాటులో ఉంటుంది.

More Telugu News