Kala Venkata Rao: బోరుకు వచ్చిన బండి గేరు మార్చినా నడవదు జగన్ రెడ్డీ: కళా వెంకట్రావు

  • గేరు మార్చాల్సిన సమయం ఆసన్నమైందన్న సీఎం జగన్
  • ఆంధ్రాకు మళ్లీ జగనే ఎందుకు కావాలి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్దేశం
  • జగన్ ఎందుకు కావాలి అంటూ ప్రశ్నించిన కళా వెంకట్రావు
  • ప్రజలు నిన్ను భరించలేం అంటున్నారని వెల్లడి
Kala Venkatarao fires on  CM Jagan

ఇక గేరు మార్చి జోరుగా దూసుకుపోవాల్సిన సమయం ఆసన్నమైందని సీఎం జగన్ వైసీపీ శ్రేణులకు కర్తవ్యబోధ చేయడంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు స్పందించారు. వైసీపీ బోరుకు వచ్చిన బండిలాంటిదని, బోరుకు వచ్చిన బండి గేరు మార్చినా నడవదు జగన్ రెడ్డీ! అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని ప్రజలంతా వైసీపీ అరాచక, దౌర్జన్య మోసపూరిత పాలన పట్ల ఉగ్రులై నిన్ను భరించలేం జగన్ రెడ్డీ అంటుంటే... సీఎం జగన్ రెడ్డి మాత్రం ఆంధ్రాకు మళ్లీ జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమం చేపట్టడం సిగ్గుచేటు అని కళా వెంకట్రావు మండిపడ్డారు. 

"రాష్ట్రంలో విధ్వంసం, విద్వేషంతో అన్ని రంగాలను నాశనం చేసి అన్ని వర్గాల ప్రజలను సమస్యల వలయంలోకి నెట్టారు. నిన్నగాక మొన్న ఇండియా టుడే సీ ఓటర్‌ నిర్వహించిన సర్వేలో వైసీపీకి 3 స్థానాలకు మించి రావన్న విషయం బట్టబయలైంది. ఇప్పుడు 175 స్థానాల్లో గెలుపంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ప్రజలను మభ్యపెట్టడానికి జగన్‌రెడ్డి ప్రదర్శిస్తున్నారు. 

ఇటీవల జరిగిన సర్పంచ్‌ ఉప ఎన్నికల్లో కూడా వైసీపీ అరాచకాలను ఎదిరించి మెజారిటీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. జగన్‌రెడ్డి యొక్క అరాచకాలను, అప్రజాస్వామిక నిర్ణయాలను నిరసిస్తూ వైసీపీ శ్రేణులు టీడీపీలో చేరుతున్నారు. గిద్దలూరులో చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా వైసీపీ ఎంపీటీసీ, సర్పంచ్‌లు తెలుగుదేశంపార్టీలో చేరుతుంటే కిడ్నాప్‌లకు కూడా పాల్పడడానికి వైసీపీ నేతలు ప్రయత్నించారు. జగన్‌రెడ్డి నాలుగున్నరేళ్ల పాలనలో ఇబ్బందిపడని వర్గమంటూ లేదు. 

ఎందుకు జగన్ ఆంధ్రాకి కావాలో ఆయనే చెప్పాలి. 2.13 లక్షల ఉద్యోగాలని ఇవ్వకుండా యువతను మోసం చేసినందుకా? కమీషన్ల కోసం పరిశ్రమల్ని తరిమేసి యువతకు ఉపాధి లేకుండా చేసినందుకా? మద్య నిషేదం చేస్తానని మాట తప్పి నాసిరకం మద్యంతో మహిళల తాళిబొట్లు తెంచుతున్నందుకా? సీపీఎస్ రద్దు చేయకుండా ఉద్యోగులను మోసం చేసినందుకా? ప్రత్యేక హోదాను కేసుల మాఫీకి తాకట్టు పెట్టి రాష్ట్రానికి ద్రోహం చేసినందుకా? రైతు భరోసా రూ.12,500  ఇస్తా అని చెప్పి రూ.7,500 ఇచ్చి మోసం చేసినందుకా? వ్యవసాయానికి సాయం అందించకుండా అన్నదాతల ఉసురు తీస్తున్నందుకా? మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా... పట్టించుకోనందుకా? ఆంధ్రాకి మళ్లీ జగనే ఎందుకు కావాలి?

టీడీపీ హయాంలో శరవేగంతో పోలవరం ప్రాజెక్టును అయిదేళ్లలో 72% పూర్తి చేస్తే, నాలుగున్నరేళ్లలో 4% పనులు కూడా పూర్తి చేయకుండా రైతులను నట్టేట ముంచిన రైతుద్రోహి జగన్‌రెడ్డి. ఎందుకు మళ్లీ ఆంధ్రాకి జగనే కావాలో సీఎం జగన్,  వైసీపీ నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలి. నాలుగున్నరేళ్లలో రాష్ట్రాన్ని 40 ఏళ్లు వెనక్కి నెట్టి... సిగ్గులేకుండా మళ్లీ జగనే కావాలి అంటూ ప్రచారం చేస్తారా?" అంటూ కళా వెంకట్రావు నిప్పులు చెరిగారు.

More Telugu News