Chandrababu: సుప్రీంకోర్టులో చంద్రబాబుకు నిరాశ.. విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేసిన ధర్మాసనం

Supreme Court adjourns Chandrababu Quash Petition to October 3
  • చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు
  • బాబు తరపున వాదనలు వినిపించిన లూథ్రా
  • రేపటి నుంచి అక్టోబర్ 2 వరకు సుప్రీంకోర్టుకు సెలవులు
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురయింది. ఆయన వేసిన క్వాష్ పిటిషన్ ను సుప్రీంకోర్టు అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. రేపటి నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సుప్రీంకోర్టుకు సెలవులు ఉండటంతో ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూథ్రా వాదననలు వినిపించారు.

ఈ పిటిషన్ తొలుత జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీ భట్టి ధర్మాసనం ముందుకు వచ్చింది. అయితే, విచారణ నుంచి జస్టిన్ ఎస్వీ భట్టి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆయన నాట్ బిఫోర్ మీ తీసుకున్నారు. దీంతో చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను సీజేఐ ముందు సిద్ధార్థ్ లూథ్రా మళ్లీ మెన్షన్ చేశారు. పిటిషన్ ను తక్షణమే లిస్టింగ్ చేయాలని సీజేఐని కోరారు. త్వరగా లిస్ట్ చేయాలనేది తమ మొదటి అభ్యర్థన అని, చంద్రబాబుకు మధ్యంతర ఉపశమనం కలిగించాలనేది రెండో అభ్యర్థన అని లూథ్రా విన్నవించారు. 

17ఏ అనేది కేసు మూలాల నుంచి చర్చించాల్సిన అంశమని లూథ్రా చెప్పారు. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని తాము కోరుకోవడం లేదని అన్నారు. పోలీసు కస్టడీ నుంచి మినహాయింపు కోరుతున్నామని చెప్పారు. ఇప్పటికే రెండు రోజుల పోలీసు కస్టడీ ముగిసిందని, మరో 15 రోజుల కస్టడీకి కోరుతున్నారని చెప్పారు. జెడ్ కేటగిరీ, ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తిని ఇలా ఎలా ట్రీట్ చేస్తారని ప్రశ్నించారు. ఇది వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన విషయమని చెప్పారు. యశ్వంత్ సిన్హా కేసులో వ్యక్తి స్వేచ్ఛపై అన్ని విషయాలను పొందుపరిచారని తెలిపారు. 

సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తుండగా ప్రభుత్వం తరపు న్యాయవాది రంజిత్ కుమార్ కల్పించుకున్నారు. అయినప్పటికీ లూథ్రా వాదనను సీజేఐ పూర్తిగా విన్నారు. ఎన్నికలు వస్తున్న తరుణంలో వరుస కేసులు వేస్తున్నారని చెప్పారు. తక్షణమే చంద్రబాబుకు ఉపశమనం కలిగించాలని కోరారు. ఇరువైపుల వాదనలు విన్న సీజేఐ డీవై చంద్రచూడ్... కోర్టుకు సెలవులు ఉన్న నేపథ్యంలో 3వ తేదీకి వాయిదా వేస్తున్నామని. వచ్చే మంగళవారం వాదనలు వింటామని చెప్పారు.
Chandrababu
Telugudesam
Supreme Court

More Telugu News