Ganesh Immersion: మహాగణపతి నిమజ్జనానికి భాగ్యనగరం ముస్తాబు.. రాత్రంతా తిరగనున్న ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లు, బస్సులు

  • హుస్సేన్ సాగర్ సహా 100 చోట్ల గణేశ్ నిమజ్జనాలు
  • 200 మంది గజ ఈతగాళ్లు, వైద్యశిబిరాలు, 79 అగ్నిమాపక వాహనాలు సిద్ధం
  • 40 వేల మంది పోలీసులతో భద్రత
  • గణపతుల తరలింపు కోసం 250 టస్కర్లు
Hyderabad Ready For Ganesh Immersion

మహాగణపతి నిమజ్జనానికి హైదరాబాద్ సిద్ధమైంది. హుస్సేన్‌సాగర్‌తోపాటు హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో దాదాపు 100 చోట్ల నిమజ్జనాలు జరగనున్నాయి. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ క్రేన్లు, జేసీబీలు, టిప్పర్లతోపాటు వేలాదిమంది సిబ్బందిని ఏర్పాటు చేసింది. నిమజ్జనం సందర్భంగా ప్రమాదవశాత్తు ఎవరైనా నీళ్లలో పడిపోతే రక్షించేందుకు 200 మంది గజ ఈతగాళ్లను కూడా సిద్ధం చేసింది. అలాగే, శోభాయాత్ర జరిగే రహదారులపై వైద్య శిబిరాలు, 79 అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచింది. నిమజ్జనానికి తరలివచ్చే వారి కోసం జలమండలి 10 లక్షల నీళ్ల ప్యాకెట్లను రెడీ చేసింది.

గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ పరధిలో 40 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 25 వేలమందికిపైగా పోలీసులను మోహరించబోతున్నారు. కాగా, 35 సంవత్సరాల తర్వాత మిలాద్ ఉన్ నబీ.. గణేశ్ నిమజ్జనం ఒకేసారి రావడంతో పోలీసు ఉన్నతాధికారులు ముందుజాగ్రత్త చర్యగా ముస్లిం మతపెద్దలతో మాట్లాడారు. మిలాద్ ఉన్ నబీ ర్యాలీని ఒకటో తేదీకి వాయిదా వేయించారు. కొందరు మాత్రం అదే రోజున జరపాలని పట్టుబడుతున్నారు. మహా గణపతులను గంగమ్మ చెంతకు చేర్చేందుకు 16 టైర్లతో కూడిన 250 టస్కర్లు, మరో 2 వేల ఇతర వాహనాలను రవాణాశాఖ సిద్ధం చేసింది. వీటిని నేటి సాయంత్రం 6 గంటల వరకు అందించనున్నారు. 

నిమజ్జనం రోజున ప్రజల సౌకర్యార్థం హుస్సేన్ సాగర్‌కు నగరం నలుమూలల నుంచి 535 బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. అలాగే, 29 తెల్లవారుజాము వరకు ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. మెట్రో రైళ్లు కూడా రేపు అర్ధరాత్రి దాటాక 2 గంటల వరకు నడవనున్నాయి.

More Telugu News