Justice SV Bhatti: సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్ పై నేడు విచారణ.. కేసును విచారించనున్న జస్టిస్ ఎస్వీ భట్టి మన తెలుగువారే!

  • చంద్రబాబు పిటిషన్ ను విచారించనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీ భట్టి ధర్మాసనం
  • జస్టిస్ ఎస్వీ భట్టిది ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి
  • మధ్యాహ్నం 11.30 గంటలకు పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం
Justice Sanjiv Khanna and Justice SV Bhatti bench to hear arguments in Chandrababu petition

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. చంద్రబాబు పిటిషన్ ఈరోజు సుప్రీంకోర్టులో లిస్ట్ అయింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీ భట్టి ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించనుంది. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లు సిద్ధార్థ్ లూథ్రా, హరీశ్ సాల్వే వాదనలను వినిపించనున్నారు. సిద్ధార్థ్ లూథ్రా నేరుగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించనుండగా, హరీశ్ సాల్వే ఫ్రాన్స్ నుంచి వర్చువల్ గా వాదనలు వినిపించబోతున్నారు. 

మరోవైపు జస్టిస్ ఎస్వీ భట్టి (సరస వెంకటనారాయణ భట్టి) ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి కావడంతో... ఆయన 'నాట్ బిఫోర్ మీ' తీసుకునే అవకాశం కూడా ఉంది. జస్టిస్ ఎస్వీ భట్టి ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందినవారు. ఒకవేళ ఆయన నాట్ బిఫోర్ మీ తీసుకుంటే... రేపటి నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్న నేపథ్యంలో విచారణ వాయిదా పడే అవకాశం ఉంటుంది. అయితే ఇదే సమయంలో ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు మాత్రం పంపుతుంది. రిమాండ్ లో ఉన్న చంద్రబాబుకు మధ్యంతర ఊరటను (ఇంటెరిమ్ రిలీఫ్) కలిగించే అవకాశాలు కూడా ఉండొచ్చు. మధ్యాహ్నం 11.30 గంటల సమయంలో పిటిషన్ విచారణకు రావచ్చని భావిస్తున్నారు. చంద్రబాబు పిటిషన్ పై ధర్మాసనం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ ఇరు తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది.

More Telugu News