చంద్రబాబు కేసు అప్డేట్స్.. ఎస్ఎల్పీపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
- తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ చంద్రబాబు పిటిషన్
- విచారించనున్న జస్టిస్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి నేతృత్వంలోని ధర్మాసనం
- అమరావతి రింగురోడ్డు కేసు నేడు విచారించనున్న ఏపీ హైకోర్టు
నిజానికీ కేసు విచారణ నిన్ననే జరగాల్సి ఉండగా సీజేఐ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కూర్చోవడంతో ఈ కేసు ఆయన ముందుకు రాలేదు. అయితే, ఈ కేసును అత్యవసర విచారణకు స్వీకరించాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు ఇచ్చిన మెన్షనింగ్ స్లిప్‌ను పరిగణనలోకి తీసుకుని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఈ కేసును జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం ముందు జాబితా చేసినట్టు తెలుస్తోంది.
చంద్రబాబు జుడీషియల్ రిమాండ్‌ను రెండుసార్లు పొడిగించడంతో అక్టోబరు 5 వరకు ఆయన జైల్లోనే ఉండనున్నారు. మరోవైపు, అమరావతి రింగురోడ్డు కేసు విచారణ నేటి మధ్యాహ్నం 2.15 గంటలకు ఏపీ హైకోర్టు విచారించనుంది. ఈ కేసులో బెయిలు కోరుతూ టీడీపీ అధినేత ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు.