Nara Lokesh: నిరసనలు ఏపీలో చేసుకోవాలన్న కేటీఆర్... హైదరాబాదులో కూడా తెలుగువాళ్లు ఉన్నారంటూ లోకేశ్ కౌంటర్!

  • చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ ఐటీ ఉద్యోగుల నిరసనలు
  • రాజమండ్రిలో భూమి దద్దరిల్లేలా చేసుకోవాలన్న కేటీఆర్
  • చంద్రబాబు అరెస్టయింది ఏపీలో అని వెల్లడి
  • శాంతియుత ప్రదర్శనలకు ఎందుకు భయపడుతున్నారన్న లోకేశ్
War of words between KTR and Lokesh over protests in Hyderabad

చంద్రబాబు ఏపీలో అరెస్ట్ అయితే హైదరాబాదులో ఎందుకు నిరసనలు చేస్తున్నారని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశ్నించడం తెలిసిందే. రాజమండ్రిలో భూమి దద్దరిల్లేలా ప్రదర్శనలు చేసుకోండి, ఇక్కడ ఇలాంటివి కుదరవు అని నిర్మొహమాటంగా చెప్పారు. ఏపీ రాజకీయాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని కేటీఆర్ అన్నారు. 

చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ కాగా, హైదరాబాదులో ఐటీ ఉద్యోగులు ధర్నాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ పైవ్యాఖ్యలు చేశారు. ధర్నాలకు ఎందుకు అనుమతి ఇవ్వడంలేదని లోకేశ్ ఫోన్ చేసి అడిగారని కేటీఆర్ వెల్లడించారు. 

అయితే, కేటీఆర్ వ్యాఖ్యల పట్ల లోకేశ్ స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లు నినదిస్తున్నారని, ఈ క్రమంలోనే నిరసనలు చేపడుతున్నారని పేర్కొన్నారు. హైదరాబాదులో కూడా తెలుగువాళ్లు ఉన్నారని, వాళ్లు శాంతియుత ప్రదర్శనలు చేపడుతుంటే ఎందుకు భయపడుతున్నారు? అని ప్రశ్నించారు. అయినా, టీడీపీ మద్దతుదారులు ఎక్కడా హద్దులు దాటి ప్రవర్తించలేదని, హైదరాబాదులో శాంతియుతంగానే నిరసన చేపట్టారని లోకేశ్ స్పష్టం చేశారు.

More Telugu News