Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ యువతకు ఇచ్చిన సందేశం ఇదే!

PM highlights youth empowerment through global collaborations
  • 30 రోజుల్లో 85 మంది ప్రపంచ నేతలను కలిశానన్న ప్రధాని మోదీ
  • ఇన్ని దేశాలను ఒకే వేదికపైకి తీసుకు రావడం చిన్న విషయం కాదని వెల్లడి
  • జీ20 సదస్సును దేశవ్యాప్త ఉద్యమంగా మలిచామని వ్యాఖ్య
గత ముప్పై రోజుల కాలంలో తాను 85 మంది ప్రపంచనేతలను కలిశానని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. ఢిల్లీలోని భారత్ మండపంలో ఏర్పాటు చేసిన జీ20 యూనివర్సిటీ కనెక్ట్ తుది వేడుకను ఉద్ధేశించి ఆయన మాట్లాడుతూ... గత నెల రోజుల్లో భారత దౌత్యం సరికొత్త శిఖరాలను తాకిందని చెప్పారు. జీ20 సదస్సు సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు 21వ శతాబ్దపు ప్రపంచ దిశను మార్చే శక్తిని కలిగి ఉన్నాయన్నారు. అంతర్జాతీయంగా భిన్న పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఇన్ని దేశాలను ఒకే వేదిక పైకి తీసుకురావడం చిన్న విషయం కాదన్నారు.

దేశ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే స్పష్టమైన, స్థిరమైన పాలన అవసరమన్నారు. చంద్రయాన్ 3 విజయాన్ని ప్రస్తావిస్తూ అగస్ట్ 23 జాతీయ అంతరిక్ష దినోత్సవంగా చరిత్రలో నిలిచిందన్నారు. జీ20 సదస్సు ఢిల్లీ కేంద్రీకృత కార్యక్రమమే అయినప్పటికీ మనం దీనిని దేశవ్యాప్త ఉద్యమంగా మలిచామని చెప్పారు. భారత్ చొరవతో బ్రిక్స్ కూటమిలో ఆరు దేశాలు చేరాయన్నారు. ఢిల్లీ డిక్లరేషన్ పైన ఏకాభిప్రాయం ప్రపంచ హెడ్ లైన్స్‌లో నిలిచిందన్నారు.

గత ముప్పై రోజుల్లో పేదలు, ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మధ్యతరగతి వర్గాల సాధికారత కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టామన్నారు. పీఎం విశ్వకర్మ, రోజ్ గార్ మేళా, కొత్త పార్లమెంట్ భవన ప్రారంభం, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి వాటిని ప్రస్తావించారు. గొప్పగా ఆలోచించాలని, ఇదే తాను యువతకు ఇచ్చే సందేశమన్నారు. కాగా, విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులను, వివిధ వృత్తుల్లోని యువ నిపుణులను అనుసంధానం చేసేందుకు జీ20 యూనివర్సిటీ కనెక్ట్ తుది వేడుకను ఏర్పాటు చేశారు.
Narendra Modi
g20
India

More Telugu News