murali mohan: అలాంటి వ్యక్తిని కనీస వసతులు లేని జైల్లో ఉంచడం బాధగా ఉంది!: మురళీ మోహన్

  • గ్రహణం వీడిన తర్వాత చంద్రబాబు బయటకు వస్తారని ఆశాభావం
  • విభజనకు ముందు, తర్వాత ఐటీ రంగంలో హైదరాబాద్ దూసుకెళు తోందని వ్యాఖ్య
  • ఏదో ఖూనీ చేసినట్లుగా, రౌడీయిజం చేసినట్లుగా తీసుకెళ్లి ఖైదీల మధ్య ఉంచారని ఆవేదన
Murali Mohan on chandrabau naidu arrest

గ్రహణం వీడిన తర్వాత చంద్రబాబు బయటకు వస్తారని, ఆయన ఏం నేరం చేశారని జైల్లో పెట్టారని మాజీ ఎంపీ, సినీ నిర్మాత మురళీ మోహన్ అన్నారు. ఆయన ఎంతో శ్రమించి ఐటీ పరిశ్రమలు స్థాపించారన్నారు. కనీస వసతులు లేని జైల్లో ఉంచడం బాధాకరమన్నారు. రాజమండ్రిలో నారా భువనేశ్వరిని కలిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ... రానున్న రోజుల్లో ఐటీ హవా ఉంటుందని భావించిన చంద్రబాబు తాను సీఎంగా ఉన్నప్పుడు ఎన్నో కంపెనీలను హైదరాబాద్‌కు తీసుకు వచ్చారన్నారు.

విభజనకు ముందు, తర్వాత ఇప్పటికీ ఐటీ రంగంలో హైదరాబాద్ దూసుకెళ్తోందన్నారు. మన యువత భవిష్యత్తును చూసిన వ్యక్తి ఆయన అన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు జైల్లో ఉండటం బాధగా ఉందన్నారు. కనీస వసతులు లేకుండా జైల్లో పెట్టారన్నారు. రాష్ట్రాన్ని ఇంతలా అభివృద్ధి చేసిన వ్యక్తిని ఏదో ఖూనీ చేసినట్లుగా, రౌడియిజం చేసినట్లుగా తీసుకెళ్లి ఖైదీల మధ్య అన్నిరోజులు ఉంచడం సరికాదన్నారు. దీనిని తాను ఖండిస్తున్నానని చెప్పారు. ఆయన కచ్చితంగా బయటకు వస్తారన్నారు.

గ్రహణం పడుతుందని, కానీ ఆ గ్రహణం ఉండేది కొద్దిసేపే అన్నారు. గ్రహణం వీడాక సూర్యుడైనా, చంద్రుడైనా దేదీప్యంగా వెలుగుతారన్నారు. అలాగే చంద్రబాబుకు పట్టిన గ్రహణం కూడా వీడుతుందన్నారు. ఆయన క్షేమంగా బయటకు వస్తారన్నారు. ఏది మంచి, ఏది చెడు అని ప్రజలు తెలుసుకున్నారని, రేపు ఆ లెక్కనే ఓట్లు వేస్తున్నారన్నారు. ఈ కష్టాలు కష్టాలుగా భావించవద్దని, వీటిని అందరూ ఓర్చుకోవాలని, మన నాయకుడు ఎంత ధైర్యంగా ఉన్నాడో మనమూ అలాగే ఉండాలని పిలుపునిచ్చారు.

More Telugu News