AP Fibernet: ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ పై వాస్తవాలు ఇవిగో: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు

  • ఏపీ ఫైబర్ నెట్ వ్యవహారంలో నాటి టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు
  • వైసీపీ ఆరోపణలకు బదులిచ్చిన టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు
  • మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ 
TDP MLC Ashok Babu power point presentation on AP Fiber Net

ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టు విషయంలోనూ టీడీపీ నేతలపై తీవ్ర ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఏపీ ఫైబర్ నెట్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పంచుకునే ప్రయత్నం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పై చట్టసభల్లో చేస్తున్న ప్రచారాన్ని నిరసిస్తూ, మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో మంగళవారం తెలుగుదేశం ఎమ్మెల్సీలు మాక్ మండలి నిర్వహించారు. ఇందులో భాగంగానే అశోక్ బాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. 


అశోక్ బాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్ హైలైట్స్... 

  • రూ.149లకే నాడు టీడీపీ ప్రభుత్వం ప్రతి ఇంటికీ టీవీ, ఇంటర్నెట్, టెలిఫోన్ కనెక్షన్ ఇవ్వడం దేశంలోనే గొప్ప సాంకేతిక విప్లవంగా నిలిచింది.
  • కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భారత్ నెట్ ప్రాజెక్ట్ లో భాగంగా అండర్ గ్రౌండ్ కేబుల్ వేసి, తద్వారా ప్రతి ఇంటికీ కనెక్షన్ ఇవ్వాలని ఆలోచించింది. దానిలో భాగంగానే నాడు ఏపీ సర్కారు ఫైబర్ నెట్ ప్రాజెక్టును తీసుకవచ్చింది.
  • ఈ ప్రాజెక్ట్ అమలుకోసం తొలుత ప్రైస్ వాటర్ హౌస్ కూపర్ సంస్థ అధ్యయనం చేసి, మొత్తం ఏపీ అంతటా అండర్ గ్రౌండ్ కేబుల్ వేయడానికి రూ.5,600కోట్ల ఖర్చవుతుందని అంచనా వేసింది.
  • అయితే నాటి సీఎం చంద్రబాబు కేబుల్ వేయడానికి అంత ఖర్చుపెట్టాల్సిన అవసరంలేదని, ఇప్పటికే ఉన్న విద్యుత్ స్తంభాల మీదుగా కేబుల్ తీసుకెళితే, తక్కువఖర్చుతో పూర్తవుతుందని చెప్పారు. 
  • ఆయన ఆలోచన ప్రకారమే నాటి ప్రభుత్వం కేవలం రూ.330 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా సమర్థవంతంగా ప్రాజెక్ట్ అమలుచేసింది. 
  • అండర్ గ్రౌండ్ ద్వారా కేబుల్ వేస్తే రూ.5,600కోట్లు అవుతుందన్న ప్రాజెక్ట్ ను, ఏపీ ప్రభుత్వం కేవలం రూ.330 కోట్లతో పూర్తిచేయడంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. 
  • విద్యుత్ స్తంభాలపై కేబుల్ వేస్తూ, ప్రతి స్తంభానికి పాయింట్ ఆఫ్ కనెక్టివిటీ ఏర్పాటు చేస్తూ, అక్కడినుంచి ఇంటింటికీ కనెక్షన్ ఇవ్వాలని నిర్ణయించి, టెండర్లు పిలవడం జరిగింది. 
  • టెండర్లలో నాలుగు కంపెనీలు ఈసీఐఎం, స్టెరిలైట్, టెరా సాఫ్ట్, పేస్ పవర్ సిస్టమ్స్ పాల్గొన్నాయి. వాటిలో స్టెరిలైట్ ఆఫ్టికల్ ఫైబర్ తయారీ సంస్థ. ఈసీఐఎం అనేది డేటా మేనేజ్ మెంట్ కంపెనీ. ఎల్ 1గా టెరాసాఫ్ట్ సంస్థ నిలిచింది. 
  • ప్రాజెక్ట్ ను ఏ సంస్థకు ఇవ్వాలనే దానిపై నాటి ప్రభుత్వం అజయ్ జైన్ నేత్రత్వంలో  హై పవర్ కమిటీ వేసింది. సదరు కమిటీ సూచనమేరకు టెరాసాఫ్ట్ కు ప్రాజెక్ట్ అమలు అప్పగించింది.
  • 2015లో ఎంపికైన టెరాసాఫ్ట్ సంస్థ, 2016 నాటికే కొన్నిప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా కనెక్షన్లు ఇచ్చేసింది. 2017 చివరినాటికి మిగిలిన మొత్తం ప్రాజెక్ట్ పూర్తిచేసింది. 
  • ఈప్రాసెస్ లో 2,455 సబ్ స్టేషన్లను అనుసంధానిస్తూ, 670 మండల కేంద్రాలు, 13 జిల్లా కేంద్రాల మీదుగా కేబుల్ తీసుకెళ్లారు. 
  • 2019 మార్చి నాటికి రాష్ట్రంలో మొత్తం 10 లక్షల గృహ కనెక్షన్లు, 9వేల వ్యాపార కనెక్షన్లు ఇవ్వడం తో పాటు, 3వేల స్కూళ్లకు కూడా కేబుల్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. 
  • కేవలం రూ.149 లకే  మూడు సౌకర్యాలు కల్పిస్తూ (టెలిఫోన్, టీవీ, ఇంటర్నెట్) కేబుల్ కనెక్షన్ ఇస్తుండడంతో, ఈ ప్రాజెక్ట్ పై రాష్ట్రవ్యాప్తంగా ఎమ్.ఎస్.వోలు నిరసన తెలిపారు. 
  • 2017లో నాటి టీడీపీప్రభుత్వం మొదలుపెట్టిన ప్రాజెక్ట్ 2019 నాటికి పది లక్షల కనెక్షన్లతో ప్రభుత్వానికి నెలకు రూ.8.70 లక్షల ఆదాయం వచ్చేలా చేసింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ ఆదాయం ఇంకా పెరిగింది. 
  • ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వం రూ.149లకు అందించిన సౌకర్యాన్ని వైసీపీ ప్రభుత్వం రూ.350 చేసింది. దాంతో కనెక్షన్లు తగ్గినా ఆదాయం మాత్రం తగ్గలేదు. ప్రాజెక్ట్ ప్రారంభించినప్ప టినుంచీ నేటివరకు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.930 కోట్ల నుంచి రూ.1070కోట్ల ఆదాయం వచ్చినట్టు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. 
  • గూగుల్ ఎక్స్ తో చేసుకున్న ఒప్పందం వల్ల అటవీప్రాంతమైన అరకు నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతమైన జాజివలస లో కూడా ఫైబర్ నెట్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది.
  • ఇంత గొప్ప ప్రాజెక్ట్ పై వైసీపీ ప్రభుత్వం నిరాధార ఆరోపణలు చేస్తూ, గతప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది. 
  • ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ లో రూ.120కోట్లు అన్యాక్రాంతం అయ్యాయని దుష్ప్రచారం చేస్తోంది. మొత్తం ప్రాజెక్ట్ అమలుకు అయిన వ్యయం రూ.333 కోట్లు అయితే, దానిలో నాటి ప్రభుత్వం కాంట్రాక్ట్ సంస్థలకు చెల్లించింది రూ.280 కోట్లే.
  • ఆ సొమ్ములో కూడా రూ.120 కోట్లు పక్కదారి పట్టాయని చెబితే మరి ఇంత గొప్ప ప్రాజెక్ట్ ఎలా అమలైంది? పది లక్షల కనెక్షన్లు ఎలా ఇవ్వగలిగారు? అనే ప్రశ్నలకు మాత్రం వైసీపీ ప్రభుత్వం నుంచి సమాధానం రావడంలేదు. 
  • పైగా, ఈ ప్రాజెక్టులో ఎల్-1గా ఎంపికైన టెరాసాఫ్ట్ సంస్థ నాటి ప్రభుత్వానికి సమర్పించిన ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్ బోగస్ అని ఈ ప్రభుత్వం చెబుతోంది. 
  • ఆ సంస్థకు ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్ ఇచ్చిన సిగ్నమ్ సంస్థ ఈ వ్యవహారంపై భిన్నవాదనలు వినిపించింది. తాను నకిలీ ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్ టెరాసాఫ్ట్ కు ఇచ్చినట్టు వైసీపీ ప్రభుత్వ ఒత్తిడితోనే  చెప్పానని సిగ్నమ్ సంస్థ యజమాని గౌరీశంకర్ ఒక సందర్భంలో చెప్పారు. మరో సందర్భంలో ఆ సర్టిఫికెట్ ఫోర్జరీ అని చెప్పాడు. అలా చెప్పిన అతన్నే ఈ ప్రభుత్వం ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమించింది.
  • హరిప్రసాద్ పై  క్రిమినల్ కేసులుంటే, అతన్ని టెండర్ ఎవాల్యుయేషన్ కమిటీలో నియమించారని ఆరోపిస్తున్నారు. వాస్తవం ఏమిటంటే...
  • హరిప్రసాద్ గతంలో ఈవీఎంలు ఎవరైనా ప్రభావితం చేయవచ్చంటూ ప్రజంటేషన్ ద్వారా మీడియా ముందు ప్రదర్శన ఇచ్చారు. అప్పుడు అతను తీసుకొచ్చిన ఈవీఎంలు ఎక్కడినుంచి వచ్చాయని, అలా తేవడం తప్పని కేసు పెట్టారు.  
  • ఒక సాంకేతిక నిపుణుడిగా ఆయన పనితీరు గమనించే టెండర్ ఎవాల్యుయేషన్ కమిటీలో ఏడుగురు సభ్యుల్లో  ఒకడిగా ఆయన్ని నియమించడం జరిగింది. అంతేతప్ప మొత్తం అతనే సర్వం కాదు. 
  • ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ టెండర్ల ఎవాల్యుయేషన్ కమిటీలో సభ్యుడిగా చేరేనాటికి హరిప్రసాద్ టెరాక్లౌడ్ డైరెక్టర్ గా, సాంకేతిక నిపుణుడిగా లేరు.
  • హరిప్రసాద్ కుమార్తె అమెరికాలో చదివేటప్పుడు ఆమె చదువుకోసం ఆయన తన స్నేహితుడు.. జెమినీ సంస్థకు చెందిన కోటేశ్వర్రావు వద్ద కొంతడబ్బు తీసుకుంటే, అది అవినీతి ద్వారా వచ్చిన సొమ్ము అని  ఈప్రభుత్వం కట్టుకథలు అల్లింది. వారిద్దరిని విచారణ పేరుతో వేధిస్తే.. ఇద్దరూ న్యాయస్థానాలను ఆశ్రయించి బెయిల్ పొందారు. అలానే ఎవాల్యుయేషన్ కమిటీలో సభ్యులైన అజయ్ జైన్ ను కూడా వేధించారు. 
  • టెండర్ లో నిర్దేశించిన నిబంధనల్లో చాలా స్పష్టంగా ఆప్టిక్ కేబుల్ ప్రపంచంలోనే బెస్ట్ నెట్ వర్కింగ్ కంపెనీ అయిన సిస్కో, ఇటలీ ప్రభుత్వ సంస్థ అయిన ఆల్టిస్  సంస్థల నుంచే అన్నిరకాల పరికరాలు తీసుకోవాలని చెప్పడం జరిగింది.
  • ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ కు అవసరమైన పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం అందించిన సిస్కో, ఆల్టిస్ సంస్థలకు ఎస్క్రో అకౌంట్ ద్వారానే చెల్లింపులు చేయడం జరిగింది. దానికి వారిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ (డీ.ఆర్.ఐ)  విచారించి నప్పుడు ముందే అనుకున్న పథకం ప్రకారం చంద్రబాబు పేరు చెప్పాలని ఒత్తిడి చేశారు. 
  • చంద్రబాబుని ఎలాగైనా ఈ వ్యవహారంలో ఇరికించాలన్న దురుద్దేశంతో నాటి ప్రభుత్వం లో ఇన్ క్యాప్ ఎండీగా పనిచేసిన అధికారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. చంద్రబాబు పేరు చెబితే వదిలేస్తామని అతన్ని ప్రలోభపెట్టారు. 
  • రూ.120 కోట్ల అవినీతి జరిగిందని చెప్పడమే తప్ప, ఆ డబ్బు ఎటు నుంచి ఎవరికి వచ్చిందనే ఆధారాలు లేవు. ఐపీఎస్ అధికారి అజయ్ జైనే స్వయంగా ఈ ప్రభుత్వం తనను ఇబ్బందిపెట్టిందని చెప్పారు.
  • గల్లా జయదేవ్ కంపెనీ సెట్ టాప్ బాక్సుల్ని ఈ ప్రాజెక్ట్ లో వినియోగించారనే ఆరోపణ కూడా అవాస్తవమే. ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ లో వినియోగించిన సెట్ టాప్ బాక్సులు అన్నీ విదేశాలనుంచి దిగుమతి చేసుకున్నవే.
  • ప్రజావేదికను కూల్చినప్పుడే ముఖ్యమంత్రి మనస్తత్వం ఏమిటో అర్థమైంది. చంద్రబాబు తీసుకొచ్చిన ఏ ప్రాజెక్ట్ కూడా రాష్ట్రంలో ఉండకూడదన్నదే జగన్ లక్ష్యం. అది ప్రజలకు ఉపయోగపడేదైనా.... రాష్టానికి ఆదాయం వచ్చేదైనా ఉండకూడదంతే. 
  • ఈ ప్రభుత్వం ఏమీ చేయకుండానే అన్నీ చేస్తున్నట్టు విషప్రచారం చేస్తోంది. టీడీపీ  ప్రభుత్వం మాత్రం చేసింది చెప్పుకోలేకపోయింది. ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలకు అంతిమంగా వాస్తవం ఏమిటో కచ్చితంగా తెలుస్తుంది. 
  • స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్, లేని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులన్నీ వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపులో భాగంగా తెరపైకి తెచ్చిన అంశాలు మాత్రమే” అని అశోక్ బాబు తేల్చిచెప్పారు.

More Telugu News