Andhra Pradesh: వైసీపీ నేతలే జగన్ ను అసహ్యించుకుంటున్నారు: నన్నపునేని రాజకుమారి

  • జనంలోకి ఎలా వెళ్లాలంటూ తలపట్టుకుంటున్నారన్న రాజకుమారి 
  • పదిమంది దోషులు తప్పించుకున్నా సరే ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదని వ్యాఖ్య 
  • హైటెక్ సిటీ నిర్మించి చంద్రబాబు ఆకాశమంత ఎత్తు ఎదిగారన్న నన్నపునేని
Sannapuneni Rajakumari Press meet

జగన్ తీరును ఆయన సొంత పార్టీ నేతలే అసహ్యించుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నన్నపునేని రాజకుమారి ఆరోపించారు. ఇలా కక్ష సాధించడమేంటని, రేపు తాము జనంలోకి ఎలా వెళ్లాలని తలలు పట్టుకుంటున్నారని చెప్పారు. ఆరోపణలు నిరూపించకుండా ఇలా జైలుకు పంపడం తప్పు కదా అని వాళ్లలో వాళ్లు అనుకుంటున్నారని చెప్పారు. ఏంటీ పిచ్చి చేష్టలని, ఈ తొందరపాటు పనులు, కక్ష సాధింపు దోరణి ఏంటని అంటున్నారని తెలిపారు. చంద్రబాబును ఇలా అరెస్టు చేయడం అన్యాయమని, ఇలా చేయడం వల్ల జనంలో వ్యతిరేకత వస్తుందని ఆందోళన చెందుతున్నారని వివరించారు. ఇదిలాగే కొనసాగిస్తే తాము ఊళ్లల్లో తిరిగే పరిస్థితి ఉండదని భయపడుతున్నట్లు నన్నపునేని రాజకుమారి తెలిపారు.

పదిమంది దోషులనైనా వదిలిపెట్టొచ్చు కానీ ఒక్క నిర్దోషిని కూడా శిక్షించవద్దని న్యాయ శాస్త్రంలోనూ ఉందని నన్నపునేని రాజకుమారి చెప్పారు. అదేవిధంగా పదిమంది తెలివితక్కువ వారిని నిర్లక్ష్యం చేసినా పర్వాలేదు కానీ ఒక మేధావిని నిర్లక్ష్యం చేయకూడదని పెద్దలు చెబుతుంటారని వివరించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు అందించిన సేవలు మన రాష్ట్రానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఆ రోజుల్లో హైటెక్ సిటీ నిర్మించి చంద్రబాబు ఆకాశమంత ఎత్తు ఎదిగారని చెప్పారు. అదేవిధంగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ను కూడా అద్భుతంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు తపన పడుతున్నారని రాజకుమారి వివరించారు.


More Telugu News