Paritala Sunitha: కాళ్లు, చేతులు పట్టుకుని ఎత్తుకెళ్లారు.. ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకుంటాం: పరిటాల సునీత 

  • తన నిరహార దీక్షను పోలీసులు భగ్నం చేయడంపై పరిటాల సునీత ఆగ్రహం
  • ఎల్లప్పుడూ ఇదే ప్రభుత్వం ఉండదని గుర్తుంచుకోవాలని పోలీసులకు వార్నింగ్
  • ప్రజల కోసం పోరాటం చేస్తున్నందుకే చంద్రబాబును అరెస్ట్ చేశారని మండిపాటు
Paritala Sunitha warning to police after foiling of her hunger strike

టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి పరిటాల సునీత చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షను ఈ తెల్లవారుజామున పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. తమ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆమె నిరవధిక నిరశన దీక్షకు దిగారు. ఆమె దీక్షను భగ్నం చేసిన పోలీసులు అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. మరోవైపు ఆమెకు సంఘీభావంగా ఉన్న పలువురు టీడీపీ శ్రేణులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. 

ఈ నేపథ్యంలో పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం, పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని... ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చేది టీడీపీనే అని చెప్పారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను నిరాహార దీక్షను చేపట్టిన శిబిరం వద్దకు పెద్ద సంఖ్యలో జనాలు వస్తారనే భయంతో దీక్షను భగ్నం చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబు కోసం శాంతియుతంగా తాము దీక్షను చేపట్టామని, ఎవరికీ ఇబ్బంది కలిగించలేదని చెప్పారు. తాము ఏం తప్పు చేశామని దీక్షను భగ్నం చేశారని ప్రశ్నించారు. 

కాళ్లు, చేతులు పట్టుకుని ఎత్తుకెళ్లారని పోలీసులపై సునీత మండిపడ్డారు. వైసీపీ నేతల ఆదేశాలతోనే పోలీసులు ఇలా వ్యవహరించారని విమర్శించారు. చంద్రబాబును, తమ పార్టీ శ్రేణులను ఇబ్బంది పెడుతున్న ఏ ఒక్కరినీ మర్చిపోమని, అందరినీ గుర్తుంచుకుంటామని హెచ్చరించారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నందుకే చంద్రబాబును అక్రమంగా జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. సైకో చెప్పినట్టుగా చేయడం పోలీసులకు తగదని అన్నారు. తాము దీక్ష చేపట్టింది ప్రైవేట్ స్థలంలో అని... అయినా తమ దీక్షను భగ్నం చేశారని మండిపడ్డారు. 

More Telugu News