BR Patil: రామ మందిరంపై బాంబులేసి ముస్లింలను నిందిస్తారు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

  • వచ్చే ఎన్నికల్లో మోదీ గెలిచేందుకు ముస్లింలపై నిందలు వేయాలని చూస్తోందన్న బీఆర్ పాటిల్
  • వీడియోను షేర్ చేసిన బీజేపీ
  • హిందూ-ముస్లింల మధ్య ఉద్రిక్తతలు పెంచేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోందన్న కాషాయ పార్టీ
 Congress MLA BR Patil remarks on Ram Manidr sparks row

బీజేపీ వాళ్లు రామ మందిరంపై బాంబులేసి ఆపై ముస్లింలను నిందించే అవకాశం ఉందంటూ కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడింది. వచ్చే ఎన్నికల్లో హిందువుల ఓట్ల కోసం బీజేపీ ఎంతకైనా తెగించే అవకాశం ఉందని ఆయన చేసిన వ్యాఖ్యల వీడియోను కర్ణాటక బీజేపీ ఎక్స్‌లో షేర్ చేసింది. ‘‘వచ్చే ఎన్నికల్లో మోదీ గెలవాలనుకుంటున్నారు. కాబట్టి హిందువుల ఓట్ల కోసం వారు (బీజేపీ) రామ మందిరంపై బాంబువేసి ఆ నెపాన్ని ముస్లిం సమాజంపై నెట్టేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది’’ అని పాటిల్ మాట్లాడడం ఆ వీడియోలో స్పష్టంగా ఉంది. అయితే, ఆయన ఎప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారన్నది తెలియాల్సి ఉంది. 

పాటిల్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. హిందూ-ముస్లింల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా పాటిల్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. హిందూయిజం పునాదులను ప్రశ్నించేందుకు బయలుదేరిన కాంగ్రెస్ ఇప్పటికీ రామ మందిరాన్ని దుష్టబుద్ధితో చూస్తోందని, దానిని అస్థిరపరిచేందుకు ప్రయత్నించడం ద్వారా హిందూ-ముస్లింల మధ్య ఉద్రిక్తతలకు ఆజ్యం పోసేందుకు ప్రయత్నిస్తోందని, ఈ విషయాన్ని ఆ పార్టీ మంత్రి బీఆర్ పాటిల్ పొరపాటున బయట పెట్టేశారని బీజేపీ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చింది. కాగా, కర్ణాటకలోని 28 లోక్‌సభ స్థానాలకు గాను 2019 ఎన్నికల్లో బీజేపీ 25 స్థానాలను గెలుచుకుంది.

More Telugu News