Manipur Violence: మణిపూర్‌లో మరో దారుణం.. కిడ్నాప్ అయిన ఇద్దరు విద్యార్థుల హత్య.. వారి వెనక సాయుధులున్న ఫొటోలు వైరల్!

  • జులైలో కిడ్నాపైన ఇద్దరు విద్యార్థులు
  • అప్పటి నుంచీ వెతుకుతున్న సీబీఐ
  • నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వం
  • మణిపూర్‌లో ఇప్పటి వరకు 180 మంది మృతి
In Manipur Horror Pics Show 2 Students Killed

మణిపూర్‌లో హింసకు అడ్డుకట్ట పడటంలేదు. జులైలో అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు హత్యకు గురైన ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. మెయిటీ తెగకు చెందిన ఇద్దరు విద్యార్థులు.. హిజమ్ లింతోయింగంబి (17), ఫిజమ్ హెమిజిట్ (20) ఓ అటవీ క్యాంపులో గడ్డిపై కూర్చుండగా వెనక సాయుధులు నిల్చున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరో ఫొటోలో వారిద్దరూ చనిపోయి నేలపై పడి ఉన్నారు. 

ఈ ఫొటోలు వెలుగులోకి రావడంతో మరోమారు నిరసనలు వెల్లువెత్తాయి. ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసును ఇప్పటికే పర్యవేక్షిస్తున్న సీబీఐ వారి జాడను గుర్తించడంలో విఫలమైంది. హత్యకు గురైన ఈ ఇద్దరు విద్యార్థులు జులైలో ఓ షాపులో వున్నట్టు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో కనిపించారు. ఆ తర్వాతి నుంచి వారి జాడ కనిపించలేదు. వారు హత్యకు గురైన ఫొటోలు వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై వేగంగా నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటామని తెలిపింది. విద్యార్థుల కిడ్నాప్, హత్య వెనక ఉన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించింది. ప్రజలు సంయమనం పాటించాలని, దర్యాప్తు సంస్థలను వాటి పని చెయ్యనివ్వాలని కోరింది. మణిపూర్‌లో మే 3న మొదలైన హింసలో ఇప్పటి వరకు 180 మంది మృతి చెందారు. వేలాదిమంది రాష్ట్రాన్ని విడిచిపెట్టారు.

More Telugu News