Rahul Gandhi: రాహుల్ గాంధీ రైలు ప్రయాణం.. తోటి ప్రయాణికులతో ముచ్చట్లు

Rahul Gandhi boards train from Bilaspur to Raipur interacts with co passengers
  • బిలాస్‌పూర్ నుంచి రాయ్‌పూర్ వెళ్లే క్రమంలో రాహుల్ గాంధీ రైలు ప్రయాణం
  • ఓ హాకీ క్రీడాకారిణి రాహుల్‌తో తన సమస్యలు చెప్పుకున్న వైనం
  • క్రీడాకారులకు అందుతున్న శిక్షణ, వసతులు, ‘ఖేలో ఇండియా’ పథకం గురించి రాహుల్ ప్రశ్నలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. సోమవారం చత్తీస్‌ఘడ్‌లోని బిలాస్‌పూర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తిరిగొచ్చేటప్పుడు రైలులో ప్రయాణించారు. రాయ్‌పూర్‌కు వెళ్లే క్రమంలో రాహుల్ గాంధీ బిలాస్‌పూర్-ఇత్వారీ ఇంటర్‌సిటీ రైలు స్లీపర్ తరగతిలో ప్రయాణించారు. రాహుల్ వెంట ఛత్తీస్‌ఘడ్ సీఎం భూపేశ్ బఘేల్, ఇతర నేతలు ఉన్నారు. 

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తోటి ప్రయాణికులతో ముచ్చటించారు. రైల్లోని హాకీ క్రీడాకారిణులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓ హాకీ క్రీడాకారిణి రాహుల్‌తో తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి చెప్పుకున్నారు. స్థానిక రాజనంద్‌గావ్‌లోని మైదానం హాకీ ఆడేందుకు అనువుగా లేదన్న విషయాన్ని రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై గతంలోనే తాము ఫిర్యాదు చేశామని కూడా పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ ‘ఖేలో ఇండియా’ ద్వారా ఆమెకు అందుతున్న సౌకర్యాల గురించి వాకబు చేశారు. శిక్షణ వసతులు ఎలా ఉన్నాయని ప్రశ్నించారు. 

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ దీనిపై స్పందించింది. ‘‘వాళ్ల ముఖాల్లో ఆనందం చూడండి.. రాహుల్ గాంధీతో కలిసి ప్రయాణించడం వారికో గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోతుంది. జననేతకు, అభినేత (నటుడు) ఉన్న తేడా ఇదే’’ అంటూ అధికార పక్షాన్ని ఉద్దేశించి సోషల్ మీడియాలో పరోక్ష విమర్శలు చేసింది.
  
Rahul Gandhi
Chattisgarh
Congress

More Telugu News