Pakistan: టెన్షన్ లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు... ఇంత వరకు ఆటగాళ్లకు వీసా మంజూరు చేయని భారత్!

  • 27న హైదరాబాద్ లో అడుగు పెట్టాల్సిన పాక్ జట్టు
  • 35 మంది వీసాల కోసం దరఖాస్తు చేసి పీసీబీ
  • వీసాలు రాకపోవడంతో దుబాయ్ కార్యక్రమం రద్దు
Pakistan Cricket team in tension for not getting Indian visas sofar

ప్రపంచ వ్యాప్తంగా అప్పుడే వన్డే ప్రపంచకప్ సందడి నెలకొంది. వచ్చే నెల 5వ తేదీన ప్రపంచకప్ ప్రారంభమవుతోంది. ఈ వరల్డ్ కప్ కు ఇండియా ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27న హైదరాబాద్ లో పాకిస్థాన్ జట్టు అడుగుపెట్టాల్సి ఉంది. ఈ నెల 29న హైదరాబాద్ లో న్యూజిలాండ్ లో పాక్ జట్టు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ జట్టు తీవ్ర ఆందోళనలో ఉంది. వరల్డ్ కప్ కోసం ఇండియాకు రావాల్సిన ఆటగాళ్లు, సపోర్టింగ్ స్టాఫ్ కు ఇస్లామాబాద్ లోని ఇండియన్ ఎంబసీ ఇంత వరకు వీసాలు మంజూరు చేయలేదు. మొత్తం 35 మంది వీసాల కోసం పాక్ క్రికెట్ బోర్డు దరఖాస్తు చేసింది. 


మరోవైపు హైదరాబాద్ కు బయల్దేరే ముందు దుబాయ్ లో రెండు రోజుల పాటు బాండింగ్ సెషన్ ను పీసీబీ ప్లాన్ చేసింది. అయితే, వీసాలపై గందరగోళం నేపథ్యంలో దుబాయ్ పర్యటన రద్దు అయింది. వీసాలు మంజూరైతే లాహోర్ నుంచి దుబాయ్ మీదుగా హైదరాబాద్ వచ్చేలా పీసీబీ షెడ్యూల్ ను మార్చింది. 

ఈ నేపథ్యంలో ఐసీసీకి పీసీబీ లేఖ రాసింది. పాకిస్థాన్ పట్ల భారత్ అనుసరిస్తున్న తీరుపై లేఖలో అభ్యంతరం వ్యక్తం చేసింది. 24 గంటల్లో వీసాలను మంజూరు చేస్తామని వారం రోజులుగా చెపుతున్నారని... అయితే భారత హోం శాఖ వీసాల కోసం ఇంకా ఎన్ఓసీ ఇవ్వలేదని తెలుస్తోందని తెలిపింది. వీసాల మంజూరులో అలసత్వం తమ ప్రపంచకప్ ప్రిపరేషన్లపై ప్రభావం చూపుతుందని చెప్పింది. పాకిస్థాన్ ఆటగాళ్ల వీసాలే డిలే అయితే... ఇక తమ దేశ జర్నలిస్టులు, అభిమానుల వీసాల పరిస్థితి ఏమిటని ఒకరు ప్రశ్నించారు.

More Telugu News