Nara Bhuvaneswari: నా సంస్థలో 2 శాతం వాటా అమ్మినా రూ. 400 కోట్లు వస్తాయి.. ప్రజల కోసం ఆలోచించడమే నా భర్త చేసిన తప్పా?: నారా భువనేశ్వరి

  • 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు చిన్న తప్పు కూడా చేయలేదన్న భువనేశ్వరి
  • రాజమండ్రికి వస్తున్న ఐటీ ఉద్యోగులను ఎందుకు అడ్డుకున్నారని మండిపాటు
  • ఏపీకి రావాలంటే పాస్ పోర్ట్, వీసా కావాలా? అని ఆగ్రహం
Is thinking of people is Chandrababu mistake asks Nara Bhuvaneswari

ప్రజల సొమ్ములను తీసుకోవాల్సిన అవసరం తమ కుటుంబానికి లేదని టీడీపీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి అన్నారు. తానే సొంతంగా ఒక సంస్థను నడుపుతున్నానని... ఆ సంస్థలో 2 శాతం వాటా అమ్మినా తమకు రూ. 400 కోట్లు వస్తాయని చెప్పారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా వందల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు చిన్న తప్పు కూడా చేయలేదని చెప్పారు. చంద్రబాబు ఎప్పుడూ ప్రజల సంక్షేమం కోసమే ఆలోచిస్తారని అన్నారు. తనతో పాటు ప్రజలను కూడా ముందుకు తీసుకెళ్లడమే ఆయన లక్ష్యమని చెప్పారు. ఏం తప్పు చేశారని ఆయనను జైల్లో పెట్టారని మండిపడ్డారు. ప్రజల కోసం ఆలోచించడమే ఆయన చేసిన తప్పా? అని ప్రశ్నించారు. నిరంతరం ప్రజల కోసమే చంద్రబాబు ఆరాటపడేవారని తెలిపారు.


ఎన్టీఆర్ చూపిన బాటలోనే చంద్రబాబు నడుచుకుంటున్నారని చెప్పారు. రాళ్లతో కూడిన హైటెక్ సిటీ ప్రాంతాన్ని ఒక శిల్పంగా మార్చారని అన్నారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఐటీ ఉద్యోగులు వస్తుంటే ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. ఏపీకి రావాలంటే పాస్ పోర్ట్, వీసా కావాలా? అని మండిపడ్డారు. మహిళలు కూడా రోడ్లపైకి వచ్చి చంద్రబాబుకు సంఘీభావం ప్రకటిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు అండగా ఉన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని  అన్నారు. తన కోడలు బ్రాహ్మణితో కలిసి ఈరోజు ఆమె అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం టీడీపీ శ్రేణులతో మాట్లాడుతూ ఆమె పైవ్యాఖ్యలు చేశారు.

More Telugu News