Khalistani terrorists: ఖలిస్థాన్ ఉగ్రవాదుల విషయమై కేంద్రం కీలక ఆదేశాలు

India proposes to cancel OCI cards of Khalistani terrorists in Canada US UK
  • విదేశాల్లోని ఖలిస్థాన్ ఉగ్రవాదులను గుర్తించాలని ఆదేశం
  • వారి ప్రాపర్టీలను జప్తు చేయాలని కోరిన కేంద్రం
  • ఓసీఐ కార్డులను సైతం నిలిపివేయాలంటూ ఆదేశం
ఖలిస్థాన్ ఉగ్రవాదుల విషయమై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాలో ఉన్న ఖలిస్థాన్ ఉగ్రవాదులను గుర్తించి, వారి పేరిట ఉన్న ఓసీఐ కార్డులను (ఓవర్ సీస్ సిటిజన్ షిప్ ఆఫ్ ఇండియా) రద్దు చేయాలని దర్యాప్తు సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. తద్వారా వారు తిరిగి భారత్ కు రాకుండా చెక్ పెట్టాలని పేర్కొంది. విదేశాల్లో స్థిరపడిన ఖలిస్థాన్ ఉగ్రవాదుల ఆస్తులను గుర్తించాలని దర్యాప్తు ఏజెన్సీలను కేంద్రం కోరినట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. 

ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) 19 మంది ఖలిస్థాన్ ఉగ్రవాదుల ప్రాపర్టీలను జప్తు చేయడం గమనార్హం. బ్రిటన్, అమెరికా, కెనడా, యూఏఈ, పాకిస్థాన్ తదితర దేశాల్లో తలదాచుకుని, భారత్ వ్యతిరేక, ప్రత్యేక ఖలిస్థాన్ అనుకూల చర్యలకు పాల్పడుతున్న వారి జాబితాను ఎన్ఐఏ విడుదల చేసింది. కెనడాలో ఈ ఏడాది జూన్ లో ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ పాత్ర ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో పార్లమెంటులో ఆరోపించడం తెలిసిందే. తదనంతర పరిణామాల్లో భారత్ వరుసగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది.

ఇప్పటికే కెనడా రాయబారిని భారత్ నుంచి వెలివేసింది. కెనడా పౌరులకు వీసాల జారీని నిలిపివేసింది. కెనడాలో నివసించే భారతీయులు తమ రక్షణ విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఇప్పుడు ఓసీఐ కార్డుల రద్దుతో ఖలిస్థాన్ ఉగ్రవాదుల విషయంలో ఇక ఉపేక్షించేది లేదనే సంకేతాన్ని, వారికి షెల్టర్ కల్పిస్తున్న దేశాలకు ఇచ్చినట్టయింది.
Khalistani terrorists
OCI cards
cancel
Centre
directs
investigative agencies

More Telugu News