nara brahmani: రాజమండ్రిలో నారా బ్రాహ్మణిని కలిసిన హైదరాబాద్ ఐటీ ఉద్యోగులు

  • విజినరీ లీడర్‌ను జైల్లో పెట్టారని బ్రాహ్మణితో అన్న ఐటీ ఉద్యోగులు
  • పోలీసుల వాహనదారుల ఫోన్ చాటింగులు చెక్ చేయడంపై బ్రాహ్మణి ఆశ్చర్యం
  • చంద్రబాబుకు ఐటీ ఉద్యోగుల మద్దతును చూసి గర్విస్తున్నానని వ్యాఖ్య
Hyderabad IT employees meet Nara Brahmani in Rajamandry

హైదరాబాద్‌లో వివిధ కంపెనీల్లో పని చేస్తోన్న ఐటీ ఉద్యోగులు రాజమండ్రిలో నారా బ్రాహ్మణిని కలిశారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అక్రమమని, ఒక విజనరీ లీడర్‌ను జైలులో పెట్టడం చాలా బాధ కలిగిస్తోందని వారు... బ్రాహ్మణితో ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఐటీ రంగ ఉన్నతికి ఎంతో కృషి చేసి లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన చంద్రబాబు అరెస్ట్ కక్ష పూరిత చర్య అన్నారు. చంద్రబాబు అరెస్టును ఏ ఒక్కరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. 

హైదరాబాద్‌లో పని చేస్తోన్న తాము రాజమండ్రికి వస్తోంటే ఏపీ పోలీసులు అనేక ఆంక్షలు పెట్టి ఇబ్బందులు పెట్టారని బ్రాహ్మణికి తెలిపారు. సొంత రాష్ట్రానికి వస్తుంటే అడ్డంకులు, కేసులు పెడతాం అనే బెదిరింపులు ఏమిటో అర్థం కావడం లేదన్నారు. తమ ఫోన్లు కూడా పోలీసులు తీసుకున్నారని, వాట్సాప్ చాటింగ్ కూడా చెక్ చేశారన్నారు. ఇక్కడ హోటల్ రూంలో దిగితే పోలీసులు వచ్చి తమను రూంలో పెట్టి తాళాలు వేశారన్నారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదన్నారు.

సైబరాబాద్ నిర్మాణంలో చంద్రబాబు చేసిన కృషిని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. 25 ఏళ్ల క్రితం రాళ్లు, రప్పలతో ఉన్న ప్రాంతం నేడు ఈ స్థాయిలో అభివృద్ది చెంది లక్షల మందికి ఉపాధినిచ్చే కేంద్రంగా మారడం వెనుక ఉన్న చంద్రబాబు కృషిని ఎవరూ చెరిపివేయలేరన్నారు.

ఈ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడుతూ... తమకు మద్దతు తెలిపేందుకు హైదరాబాద్ నుంచి వస్తోన్న ఐటీ ఉద్యోగులపై ఆంక్షలు, బెదిరింపులు దారుణమన్నారు. హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనదారుల ఫోన్‌లు చెక్ చేయడం, వారి చాట్‌లు పరిశీలించడం షాక్‌కు గురిచేసిందన్నారు. పోలీసుల చర్య వ్యక్తి గత గోప్యత హక్కును హరించడమే అన్నారు. సామాన్య ప్రజల ఫోన్‌లు చెక్ చేసే హక్కు పోలీసులకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. అసలు ఏ కారణంతో, హక్కుతో ఉద్యోగుల రాకపై ఆంక్షలు పెట్టారో చెప్పాలన్నారు. మీకు తెలిసి రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఉందా అని బ్రాహ్మణి... ఐటీ ఉద్యోగులను ప్రశ్నించారు.

చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు ఎన్నో ఇబ్బందులకు ఓర్చి, ప్రభుత్వ నిర్భందాలను దాటుకుని వచ్చిన ఉద్యోగులను చూసి తాను గర్వ పడుతున్నానన్నారు. వారికి ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు ఈ కష్ట సమయాన్ని అధికమిస్తారని, సంక్షోభాలను అవకాశంగా మార్చుకునే శక్తివంతమైన నాయకుడు ఆయన అన్నారు. యువత అంతా తమ ఓట్లు చెక్ చేసుకోవాలని సూచించారు. రానున్న రోజుల్లో ఓటు హక్కుతో ఈ ప్రభుత్వానికి బుద్దిచెప్పాలన్నారు.  ఆన్ లైన్ ద్వారా ఓటు నమోదు చేసుకోవడంతో పాటు అక్రమంగా ఎవరూ తమ ఓట్లు తొలగించకుండా ప్రజలను చైతన్య పరిచే బాధ్యత తీసుకోవాలని తనను కలిసిన ఉద్యోగులను ఆమె కోరారు.

More Telugu News