Prabhas: ‘సలార్‌’ సందడి ఈ ఏడాది లేనట్టే!‌

  • ప్రభాస్, ప్రశాంత్ నీల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం
  • ఈ నెల 28న విడుదలను వాయిదా వేసిన చిత్ర బృందం
  • వచ్చే మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం
 Salaar Strategically Moved To 2024 March

రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సలార్‌‌’ కోసం ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రం ఈ నెల 28నే విడుదల కావాల్సి ఉంది. కానీ, పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు కాకపోవడంతో  విడుదల వాయిదా పడింది. కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామన్న చిత్ర బృందం ఇంకా రిలీజ్‌ డేట్‌ను ఖరారు చేయలేదు. ప్రస్తుత సమాచారం మేరకు ఈ సినిమా ఈ  ఏడాది విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు. నవంబర్ చివర్లో తేదా డిసెంబర్‌‌లో విడుదల చేయాలని అనుకున్న నిర్మాణ సంస్థ హోంబాలే ఫిలిమ్స్ ఆ ఆలోచన కూడా విరమించుకున్నట్టు తెలుస్తోంది. 

ఆ సమయంలో ఇతర పెద్ద సినిమాలతో పోటీ నేపథ్యంలో సోలో రిలీజ్‌, పెద్దగా ఒత్తిడి లేకుండా వచ్చే ఏడాదిలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. వేసవి కానుకగా 2024 మార్చి 22వ తేదీన సినిమాను విడుదల చేయాలని ఈ మేరకు తమ డిస్ట్రిబ్యూటర్లకు నిర్మాణ సంస్థ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. గతేడాది మార్చి 25న విడుదలైన ఆర్ఆర్ఆర్ అఖండ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో  వేసవి విడుదలపైనే హోంబలే ఫిలిమ్స్‌ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. దానికి తగ్గట్టుగానే సినిమా ప్రమోషన్స్‌ను సైతం ఆలస్యంగా మొదలు పెట్టనున్నారు. ఈ లెక్కన వచ్చేనెల ప్రభాస్ పుట్టినరోజు నాడు ట్రైలర్ కూడా రావడం కష్టమేనని తెలుస్తోంది.

More Telugu News