Visakhapatnam District: సిగరెట్ కోసం వివాదం.. స్నేహితుడిని చంపేసిన టీనేజర్లు

fight over cigarette led to Friends killing teenager in vizag
  • విశాఖపట్నంలో కలకలం రేపుతున్న ఘటన
  • సెప్టెంబర్ 21 అర్ధరాత్రి స్నేహితులతో కలిసి సిగరెట్ తాగిన టీనేజర్
  • సిగరెట్ కోసం వారి మధ్య వివాదం మొదలవడంతో బాలుడిని హత్య చేసిన స్నేహితులు
  • మృతదేహాన్ని సముద్రంలో విసిరేసిన వైనం
  • పోలీసులకు మృతదేహం లభించడంతో నిందితుల ఆటకట్టు
సిగరెట్ కోసం చెలరేగిన వివాదం ఓ బాలుడి హత్యకు దారితీసింది. స్నేహితులే అతడిని పొట్టనపెట్టుకున్నారు. విశాఖలో ఇటీవల జరిగిన ఈ ఉదంతం కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఏవీఎస్ కళాశాల సమీపంలో నూకాలమ్మ అనే మహిళ తన కుమారుడు చిన్నాతో (17) కలిసి నివసిస్తోంది. అయితే, పాతనగరంలోని విస్కీ అనే రౌడీషీటర్‌ను ఆదర్శంగా తీసుకున్న చిన్నా చివరకు వ్యసనాలకు బానిసయ్యాడు. 

ఈ నెల 20న స్నేహితులతో కలిసి అతడు చవితి ఉత్సవాల్లో పాల్గొన్నాడు. ఆ మరుసటి రోజు అర్ధరాత్రి దాటాక మరో నలుగురు స్నేహితులతో కలిసి సిగరెట్లు తాగాడు. ఈ క్రమంలో వారి మధ్య సిగరెట్ కోసం గొడవ మొదలైంది. చివరకు స్నేహితులే చిన్నా గొంతు కోసి హత్య చేశారు. ఆ తరువాత అతడి మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి దాచారు. 

మరుసటి రోజు తెల్లవారుజామున వినాయకచవితి సామాగ్రి తరలించడం కోసం ఓ ఆటో మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే చిన్నా మృతదేహాన్ని కూడా ఆటోలో చేపల చెరువు వద్దకు తీసుకెళ్లి అక్కడ సముద్రంలో విసిరేశారు. చిన్నా మృతదేహం పోలీసులకు లభించడంతో వారు ఆటోడ్రైవర్‌ను వెతికిపట్టుకుని విచారించారు. దీంతో, అతడు జరిగిందంతా చెప్పడంతో పోలీసులు చిన్నాను చంపిన నలుగురు టీనేజర్లను అదుపులోకి తీసుకుని జువైనల్ హోంకు తరలించారు.
Visakhapatnam District
Andhra Pradesh
Crime News

More Telugu News