West Bengal: బాలుడి చొరవతో తప్పిన రైలు ప్రమాదం

West bengal train accident averted by 10 year old kid
  • పశ్చిమబెంగాల్ మాల్దా జిల్లా కరియాలి గ్రామంలో ఘటన
  • రైలు పట్టాల కింద గొయ్యిని గమనించిన పదేళ్ల బాలుడు
  • తన ఎర్ర టీషర్టును తొలగించి గాల్లో ఊపుతూ లోకోపైలట్‌ను అప్రమత్తం చేసిన వైనం
  • రైలును వెంటనే ఆపేయడంతో తప్పిన ప్రమాదం
  • బాలుడి పేరును అవార్డుకు సిఫారసు చేస్తామన్న రైల్వే అధికారులు
భారీ రైలు ప్రమాదం తప్పించిన పశ్చిమబెంగాల్ బాలుడిపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది. పదేళ్ల వయసులోనే ఆ బాలుడు సమయస్ఫూర్తితో అనేక మంది ప్రాణాలు కాపాడాడు. మాల్దా జిల్లాకు చెందిన ముర్సెలీమ్ (10) తన కుటుంబంతో కలిసి కరియాలి గ్రామంలో నివసిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం అతడు స్థానికంగా ఉన్న ఓ కుంటలో చేపలు పట్టేందుకు వెళుతుండగా రైలు పట్టాల కింద గొయ్యి కనిపించింది. మరోవైపు, అగర్తల-సియాల్దా కాంచన్‌జుంగా ఎక్స్‌ప్రెస్ వేగంగా అటువైపు దూసుకురావడం అతడు చూశాడు.

రాబోయే ప్రమాదాన్ని గ్రహించిన ఆ బాలుడు క్షణం ఆలస్యం చేయకుండా పట్టాల వద్ద నిలబడి తాను ధరించిన ఎర్రని టీషర్టును తీసి గాల్లో ఊపుతూ ట్రెయిన్ లోకోపైలట్‌ను అప్రమత్తం చేశాడు. బాలుడి సిగ్నల్‌ను గమనించిన లోకోపైలట్ వెంటనే రైలును ఆపేశారు. బాలుడు నిలబడ్డ చోటుకు వచ్చి చూడగా అక్కడ పట్టాల కింద గొయ్యి కనిపించింది. అక్కడి కంకర కొట్టుకుపోవడంతో గొయ్యి ఏర్పడినట్టు గుర్తించారు. దీంతో, వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించిన ఆయన బాలుడిని పొగడ్తల్లో ముంచెత్తారు. అనంతరం, రైల్వే సిబ్బంది వచ్చి గొయ్యిని పూడ్చేయడంతో గంట తరువాత రైలు యాథావిధిగా బయలుదేరింది. కాగా, పెను ప్రమాదం తప్పించిన బాలుడి పేరును అవార్డు కోసం సిఫారసు చేస్తామని రైల్వే అధికారులు తెలిపారు.
West Bengal
Indian Railways

More Telugu News