Motkupalli Narasimhulu: ముష్టి రూ. 371 కోట్ల కోసం చంద్రబాబు దిగజారుతారా?.. జగన్ పై నిప్పులు చెరిగిన మోత్కుపల్లి

  • సీఎం అయిన తెల్లారే జగన్ మైకంలోకి వెళ్లాడని మోత్కుపల్లి విమర్శ
  • తల్లిని, చెల్లిని గెంటేసిన వ్యక్తి అని మండిపాటు
  • రాజధాని లేని రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని ఎద్దేవా
  • చంద్రబాబు గురించి మాట్లాడేందుకు నీకు సిగ్గుందా అంటూ ఫైర్
  • చంద్రబాబు క్రిమినల్ కాదు అని వ్యాఖ్య
Motkupalli fires on Jagan and says Chandrababu is leader of nation

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై తెలంగాణ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు విరుచుకుపడ్డారు. ఈరోజు ఆయన హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో ఎన్టీఆర్ కు నివాళి అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ నిప్పులు చెరిగారు. 

"2018 ఎన్నికల సమయంలో ఇదే ఘాట్ నుంచి నేను మాట్లాడుతూ జగన్ గెలవాలని చెప్పాను. నా పిలుపుతో దళిత వర్గాలు, పేద వర్గాలన్నీ ఏకమై జగన్ ను గెలిపించాయి. అధికారంలోకి వచ్చిన తెల్లారే జగన్ మైకంలోకి వెళ్లాడు. ఆ మైకం ఎంత వరకు వెళ్లిందంటే... తల్లిని ఇంటి నుంచి బయటకు పంపించాడు. జైల్లో ఉన్నప్పుడు ఆయన కోసం వేల కిలోమీటర్లు నడిచిన చెల్లెలు షర్మిలను మెడబట్టి బయటకు గెంటాడు. ఆయన పాలన ఎలా ఉందంటే... రాజధాని లేని రాజ్యాన్ని నడిపిస్తున్నాడు. జగన్ పాలించే రాష్ట్రంలో రాజధానే లేదు. 151 సీట్లు ప్రజలిస్తే అది అహంకారంలోకి వెళ్లింది. ఒక్క ఛాన్స్ ఇస్తే బాగా పాలిస్తాడని ప్రజలు నమ్మారు. కానీ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా జగన్ పాలిస్తున్నాడు. మాట్లాడిన వాడినల్లా కొట్టి, తిట్టి, భయపెట్టి నియంత మాదిరి జగన్ రాజ్యమేలుతున్నాడు.

74 సంవత్సరాల పెద్దమనిషి, ఈ దేశానికే నాయకుడు, వాజ్ పేయి ప్రభుత్వానికి సలహాదారుడిగా ఉన్న చంద్రబాబును జైల్లో పెట్టి రాక్షసానందం పొందుతున్నావా? నువ్వొక దుర్మార్గుడివి. 2021లో కేసు బుక్ అయింది. కేసులో ఉన్న వారంతా బెయిల్ పై ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబును ఏ ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడం ఏమిటి? చంద్రబాబు వంటి పెద్ద మనిషిని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి. ఏపీలో టీడీపీ హయాంలో రూ. 7 - 8 లక్షల కోట్ల బడ్జెట్ చంద్రబాబు చేతుల మీదుగా ప్రజలకు వెళ్లింది. అలాంటి పెద్ద మనిషి ముష్టి రూ. 371 కోట్లకు దిగజారుతాడా? మాట్లాడేందుకు నీకు సిగ్గు, బుద్ధి వున్నాయా? మూడు సార్లు ముఖ్యమంత్రి, ఎన్నడూ ఏ ఆరోపణ కూడా రుజువు కాలేనటువంటి పెద్దమనిషి చంద్రబాబు. ఆయన ఏనాడూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు. చంద్రబాబు క్రిమినల్ కాదు. 

వ్యక్తులే లేకుండా చేయాలనుకుంటున్నావా జగన్? ఈ నాలుగేళ్లు ఏం పీకావని నేను అడుగుతున్నా. ఎన్నికలు రేపు అనగా.. ఈరోజు చంద్రబాబును అరెస్ట్ చేయడంలో నీ ఉద్దేశం ఏమిటి? చంద్రబాబు వయసుకు విలువిచ్చి నీవు వెంటనే ఆయనకు క్షమాపణ చెప్పు" అంటూ జగన్ పై మోత్కుపల్లి ఫైర్ అయ్యారు.

More Telugu News