Mynampally Hanumantha Rao: బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మైనంపల్లి హన్మంతరావు

  • కొంతకాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్న మైనంపల్లి
  • మల్కాజిగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం
  • ఈసారి ఎన్నికల్లో తన కుమారుడికి కూడా టికెట్ కోరిన మైనంపల్లి
  • తిరస్కరించిన బీఆర్ఎస్ హైకమాండ్
Mynampally Hanumantha Rao resigns to BRS Party

మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కొన్నాళ్లుగా పార్టీ అధినాయకత్వంతో ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. ఇవాళ తన రాజీనామా ప్రకటన చేశారు. మల్కాజిగిరి ప్రజలు, కార్యకర్తలు, తెలంగాణ నలుమూలలా ఉన్న తన శ్రేయోభిలాషుల కోరిక మేరకు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని మైనంపల్లి ఓ వీడియోలో తెలిపారు. 

తాను ఏ పార్టీలో చేరేది వీలైనంత త్వరలో తెలియజేస్తానని వెల్లడించారు. ఇప్పటివరకు తనకు అందించిన సహకారానికి గాను కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. మల్కాజిగిరి ప్రజలకు, రాష్ట్రంలోని తన శ్రేయోభిలాషులకు కడవరకు అండగా నిలుస్తానని వివరించారు. ప్రజల కోరిక మేరకే తన భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని, దేనికీ భయపడేది లేదని మైనంపల్లి హన్మంతరావు స్పష్టం చేశారు. 

మరో రెండు నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, బీఆర్ఎస్ ఇటీవల టికెట్లు ప్రకటించింది. అయితే, తనకు, తన కుమారుడు రోహిత్ కు టికెట్లు ఆశించిన మైనంపల్లి భంగపడ్డారు. రోహిత్ కు మెదక్ స్థానం ఇవ్వాలన్న మైనంపల్లి విజ్ఞప్తిని పార్టీ అధిష్ఠానం తోసిపుచ్చింది. 

ఇటీవల బీఆర్ఎస్ తొలి విడత జాబితా ప్రకటించినప్పటికీ, అప్పటికే మైనంపల్లిని రెబల్ కింద పరిగణించారు. ఈ క్రమంలో ఆయన రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన ఏ పార్టీ వైపు అడుగులేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మైనంపల్లి 1998లో టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు.

More Telugu News