Mohammed Shami: షమీకి 5 వికెట్లు... ఆసీస్ 276 ఆలౌట్

  • టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్
  • నేడు మొహాలీలో తొలి వన్డే
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
  • ఆసీస్ ను కట్టడి చేసిన షమీ
  • వార్నర్ అర్ధసెంచరీ... రాణించిన స్టీవ్ స్మిత్, లబుషేన్, ఇంగ్లిస్
  • ఆఖర్లో బ్యాట్ ఝళిపించిన కెప్టెన్ కమ్మిన్స్
Shami claims five as Aussies all out for 276 runs om 1st ODI

మొహాలీలో టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. ఆసీస్ పై 5 వికెట్లు తీసి సత్తా చాటాడు. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 50 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌట్ అయింది. 

కంగారూలను ఓ మోస్తరు స్కోరుకే కట్టడి చేయడంలో షమీది కీలకపాత్ర. తొలుత ఓపెనర్ మిచెల్ మార్ష్ (4)ను అవుట్ చేసిన షమీ... ఆ తర్వాత స్టీవ్ స్మిత్ ను అవుట్ చేయడం ద్వారా వార్నర్ తో కీలకభాగస్వామ్యాన్ని విడదీశాడు. ఆ తర్వాత స్టొయినిస్ (29), మాథ్యూ షార్ట్ (2), షాన్ అబ్బాట్ (2) కూడా షమీకి వికెట్లు అప్పగించారు. 

ఆసీస్ ఇన్నింగ్స్ లో వార్నర్ 52, స్టీవ్ స్మిత్ 41, లబుషేన్ 39, కామెరాన్ గ్రీన్ 31, వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ 45 రాణించారు. చివర్లో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ బ్యాట్ ఝళిపించాడు. కమిన్స్ 9 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ తో 21 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 

ఆసీస్ బ్యాటింగ్  చేస్తున్న సమయంలో వర్షం స్వల్ప అంతరాయం కలిగించనప్పటికీ, మ్యాచ్ కాసేపట్లో తిరిగి ప్రారంభమైంది.

More Telugu News