Andhra Pradesh: అసెంబ్లీని వైసీపీ కార్యాలయంగా మార్చేశారు: అచ్చెన్నాయుడు

  • స్పీకర్ తమ్మినేనిపై విమర్శలు గుప్పించిన టీడీపీ నేత
  • వాయిదా తీర్మానాన్ని కూడా చదవలేదని ఆరోపణ
  • రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించారని మండిపాటు
  • మమ్మల్ని యూజ్ లెస్ ఫెలోస్ అని తిట్టినపుడే ఆయనపై గౌరవం పోయిందని వ్యాఖ్య 
  • వైసీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ మన సభ్యులంటూ సంబోధించారని వెల్లడి
  • స్పీకర్ వైఖరి, అధికారపక్షం తీరుకు నిరసనగా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు వివరణ
  • సస్పెన్షన్ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు
TDP Leader MLA Acham Naidu Press Meet

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని స్పీకర్ తమ్మినేని సీతారామ్ వైసీపీ కార్యాలయంగా మార్చేశారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పటికీ ఆయన పక్షపాత ధోరణితో వ్యవహరించారని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలను యూజ్ లెస్ ఫెలోస్ అని తిట్టినపుడే ఆయనపై గౌరవం పోయిందన్నారు. మమ్మల్ని తిడుతూ.. వైసీపీ ఎమ్మెల్యేలను మన సభ్యులంటూ గౌరవంగా సంబోధించారని చెప్పారు. టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ పక్కన పెట్టారని మండిపడ్డారు. చంద్రబాబుపై అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, ముఖ్యమంత్రి జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుతూ తాము తీర్మానం ఇచ్చామన్నారు. చర్చిస్తామని చెబుతూనే దీనిని పక్కన పెట్టారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. గతంలో శాసనసభలో చర్చలు జరిగిన తీరును గుర్తుచేసుకోవాలంటూ అధికారపక్ష నేతలకు సూచించారు.

ప్రజా సమస్యలపై పట్టింపేది?
అధికారంలోకి వచ్చింది మొదలు చంద్రబాబుపై దుమ్మెత్తిపోయడమే తప్ప ఈ నాలుగున్నరేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏనాడైనా ప్రజాసమస్యలపై చర్చించిందా.. అంటూ అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. స్పీకర్ తన బాధ్యతను మరిచి వైసీపీ శాసన సభ్యుడిగా పనిచేయడం వల్ల అధికారపక్షానిది పైచేయి అవుతోందని ఆరోపించారు. నాలుగున్నరేళ్లలో ఏనాడూ ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశమే ఇవ్వలేదని విమర్శించారు. మమ్మల్ని మాట్లాడకుండా చేసి, వారు మాత్రం సినిమాలు చూపిస్తున్నారని చెప్పారు. ఈ విధంగా ప్రజలను బ్రమల్లో ఉంచాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తమకు అవకాశం ఇస్తే ప్రజలకు వాస్తవాలను తెలియజేస్తామని అన్నారు. వాస్తవాలు చెప్పడానికి ప్రయత్నిస్తే మా మైకులు ఆపేస్తారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి, ప్రభుత్వం ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రత్యేకంగా సమావేశాలు పెట్టి చర్చిద్దాం..
అచ్చంగా అవినీతిపై చర్చించేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను ఐదు రోజుల పాటు నిర్వహిద్దామని, అందులో జగన్ అవినీతి, ఆయనపై ఉన్న కేసుల గురించి చర్చిద్దామని అచ్చెన్నాయుడు చెప్పారు. దీంతో పాటు చంద్రబాబుపై పెట్టిన తప్పుడు కేసులపైనా చర్చిద్దామని అన్నారు. ఈ చర్చల ఎపిసోడ్ ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలకు చూపిద్దామని, అప్పుడు ఎవరి బాగోతం ఏంటనేది ప్రజలే గుర్తిస్తారని చెప్పారు. ఈ ప్రతిపాదనకు అధికారపార్టీ సిద్ధమేనా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

వీడియోలు తీయకుండా ఏంచేయాలి..?
సాక్షి సిబ్బందిని సభలోకి అనుమతించి, మేం మాట్లాడేది మాత్రమే చూపిస్తూ.. అధికారపక్ష సభ్యులు వేసే వీరంగం ప్రజలకు తెలియకుండా చేస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రభుత్వం ఇలా చేస్తుంటే అడ్డుకోవాల్సిన స్పీకర్ కూడా ప్రభుత్వానికే వంతపాడుతున్నారని విమర్శించారు. ఇలాంటి పరిస్థితిలో సభలో జరిగే తంతును ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే తాము ఫోన్లలో వీడియోలు తీశామని అచ్చెన్నాయుడు వివరించారు. సభలో మేం పదిహేడు మందిమి ఉండగా..  చుట్టూ 200 మంది మార్షల్స్ ను పెట్టారని అచ్చెన్నాయుడు వివరించారు. చుట్టూ గోడకట్టినట్టు మార్షల్స్ నిలబడితే, స్పీకర్ ఏం చేస్తున్నాడో.. అధికారపార్టీ సభ్యులు ఏంచేస్తున్నారో మాకెలా తెలుస్తుందని ప్రశ్నించారు.

వారు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నా, స్పీకర్ కు సైగలు చేసినా తప్పులేదు కానీ మేం నోరెత్తితేనే తప్పా అని నిలదీశారు. అధికార పక్షం తమ సొంత మీడియా సాక్షిని మాత్రమే సభలోనికి అనుమతించిందని ఆరోపించారు. ప్రభుత్వానికి అనుకూలంగా ప్రసారం చేయిస్తూ, మిగతా వాటిని ఆపేస్తూ టీడీపీ నేతలను దుర్మార్గంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. సభలోనికి ఆ ఒక్క ఛానల్ ను మాత్రమే ఎలా అనుమతిస్తారని, మీడియా అంటే సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ మాత్రమేనా అని ప్రశ్నించారు. ధైర్యముంటే శాసనసభలో జరిగే ప్రతీ పరిణామాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ అచ్చెన్నాయుడు ప్రభుత్వానికి సవాల్ విసిరారు. 

సమావేశాల బహిష్కరణ
పదిరోజుల నుంచీ స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ పై వైసీపీ నేతలు ఎలా దుష్ప్రచారం చేస్తున్నారో.. వాస్తవాలను తొక్కిపెట్టి చంద్రబాబును తప్పుడు మనిషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారో ప్రజలు చూస్తూనే ఉన్నారని అచ్చెన్నాయుడు అన్నారు. మంత్రులు, ప్రభుత్వం, సీఐడీ అధికారులు.. ఎవరెలా మాట్లాడుతున్నారో వింటూనే ఉన్నారని అన్నారు. ఈ క్రమంలో శాసన సభలో జరిగిన పరిణామాలకు కలతచెంది, అధికారపార్టీ సభ్యుల తీరును నిరసిస్తూ ఈ సమావేశాలను టీడీపీ బహిష్కరిస్తోందని అచ్చెన్నాయుడు ప్రకటించారు. శనివారం నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలకు టీడీపీ సభ్యులు హాజరు కాబోరని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

More Telugu News