Tamilnadu: కారు డ్రైవర్ ఖాతాలో అకస్మాత్తుగా రూ.9 వేల కోట్ల జమ

  • తమిళనాడు రాజధాని చెన్నైలో ఘటన
  • రూ.9 వేల కోట్లు తన ఖాతాలో చూసుకుని డ్రైవర్‌కు షాక్
  • నిజానిజాలు తేల్చేందుకు స్నేహితుడికి రూ.21 వేలు బదిలీ 
  • ఇంతలో బ్యాంకు నుంచి ఫోన్, మొత్తం డబ్బు వాపసు ఇవ్వాలన్న అధికారులు
  • చివరకు రూ.21 వేలు మినహా మిగతా డబ్బు వెనక్కు తీసుకున్న వైనం
9000 crores transferred to tamil nadu car driver accidentally by Tamilnadu mercantile bank

తమిళనాడుకు చెందిన ఓ కారు డ్రైవర్‌ ఖాతాలో ఇటీవల అకస్మాత్తుగా 9 వేల కోట్లు జమైంది. ఆ తరువాత, బ్యాంకు అధికారులు ఆ మొత్తాన్ని వెనక్కు తీసేసుకున్నారు. చెన్నైలో ఈ ఘటన వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే, పళని నెయక్కారపట్టికి చెందిన రాజ్‌కుమార్ చెన్నైలోని కోడంబాక్కంలో స్నేహితుడి వద్ద ఉంటూ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 9న మధ్యాహ్నం మూడు గంటల సమయంలో అతడి మొబైల్‌కు తమిళనాడు మర్కెంటైల్ బ్యాంకు నుంచి డబ్బు జమ అయినట్టు మెసేజ్ వచ్చింది. మెసేజ్ చూస్తే ఏకంగా రూ. 9 వేల కోట్లు కనిపించింది. 

ఇది నమ్మలేకపోయిన అతడు నిజానిజాల్ని నిర్ధారించుకునేందుకు తన స్నేహితుడికి రూ.21 వేలు బదిలీ చేశాడు. చివరకు అది నిజమని నిర్ధారించుకున్నాక సంబరంలో మునిగితేలాడు. కానీ ఆ సంతోషం ఎక్కువ సేపు మిగల్లేదు. ఆ తరువాత బ్యాంకు వారు రాజ్‌కుమార్‌కు ఫోన్ చేసి పొరపాటున రూ.9 వేల కోట్లు బదిలీ అయ్యిందని వివరించారు. తన స్నేహితుడికి పంపిన డబ్బుతో పాటూ మొత్తం సొమ్మును తమకు అప్పగించాలన్నారు. అయితే, రాజ్‌కుమార్ తరఫున న్యాయవాదులు వెళ్లి బ్యాంకు అధికారులతో మాట్లాడటంతో ఆ రూ.21 వేలు వెనక్కు ఇవ్వాల్సిన పనిలేదని, వాహన రుణంగా ఇస్తామని బ్యాంకు అధికారులు చెప్పినట్టు తెలుస్తోంది.

More Telugu News