World Cup: హైదరాబాదులో ప్రేక్షకులు లేకుండానే వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్!

  • అక్టోబరు 5 నుంచి భారత్ లో ఐసీసీ వరల్డ్ కప్
  • టోర్నీకి ముందు సన్నాహక మ్యాచ్ లు
  • సెప్టెంబరు 29న ఉప్పల్ స్టేడియంలో పాకిస్థాన్-న్యూజిలాండ్ ప్రాక్టీసు మ్యాచ్
  • గణేశ్ నిమజ్జనం ఉండడంతో మ్యాచ్ కు తాము భద్రత కల్పించలేమన్న పోలీసులు
Hyderabad police advises HCA to conduct world warm up match with out spectators

భారత్ లో అక్టోబరు 5 నుంచి ఐసీసీ వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో, టోర్నీకి ముందు ఆయా జట్లు సన్నాహక మ్యాచ్ లు ఆడనున్నాయి. ఈ నెల 29న హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో పాకిస్థాన్-న్యూజిలాండ్ జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ జరగనుంది. 

అయితే, ఈ ప్రాక్టీసు మ్యాచ్ పై పోలీసులు కొన్ని ప్రతిపాదనలు చేశారు. ఈ నెల 28, 29 తేదీల్లో నగరంలో గణేశ్ నిమజ్జనం ఉండడంతో, ఆ దిశగా మరింత భద్రతను అందించాల్సి ఉందని పోలీసులు స్పష్టం చేశారు. 

స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించేట్టయితే అత్యధిక సంఖ్యలో పోలీసులతో భద్రత అందించాల్సి ఉంటుందని, గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో తాము పెద్ద సంఖ్యలో పోలీసులతో భద్రత కల్పించలేమని వివరించారు. అందుకే పాక్-కివీస్ వార్మప్ మ్యాచ్ ను ప్రేక్షకులు లేకుండానే జరుపుకోవాలని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్ సీఏ) పెద్దలకు పోలీసులు వివరించారు. 

పోలీసుల సూచనలను హెచ్ సీఏ పాటించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం 1,500 టికెట్లు విక్రయించినప్పటికీ, ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ జరపడానికే హెచ్ సీఐ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.

More Telugu News