Chandrayaan-3: చంద్రుడిపై మరోసారి సూర్యోదయం... ల్యాండర్, రోవర్ ల నుంచి సందేశాల కోసం ఎదురుచూస్తున్న ఇస్రో

ISRO awaits for signals from Lander and Rover on Moon surface
  • ఇస్రో చంద్రయాన్-3 గ్రాండ్ సక్సెస్
  • ఇటీవల చంద్రుడిపై రాత్రి... రోజుల తరబడి చీకటి 
  • ల్యాండర్, రోవర్ లను నిద్రాణ స్థితిలోకి పంపిన ఇస్రో
  • చంద్రుడిపై అత్యంత చల్లని రాత్రిని చంద్రయాన్-3 వ్యవస్థలు తట్టుకోగలవా అన్నదానిపై ఆసక్తి
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 గ్రాండ్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. చంద్రయాన్-3 మిషన్ లోని ల్యాండర్, రోవర్ సౌరశక్తి ఆధారంగా పనిచేస్తాయన్న నేపథ్యంలో, చంద్రుడిపై చీకటి నెలకొనడంతో ల్యాండర్, రోవర్ ను సెప్టెంబరు 3న ఇస్రో నిద్రాణ స్థితిలోకి పంపింది. 

అయితే, చంద్రుడిపై మరోసారి సూర్యోదయం కావడంతో... విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ల నుంచి సందేశాల కోసం ఇస్రో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. చంద్రుడిపై సూర్య కాంతి పరుచుకుంటుండడంతో చంద్రయాన్-3 వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో చూడాల్సి ఉందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమ్ నాథ్ తెలిపారు. చంద్రుడిపై సుదీర్ఘకాలం పాటు సాగే రాత్రి అత్యంత శీతలంగా ఉంటుందని, ఇంత చల్లని వాతావరణాన్ని ల్యాండర్, రోవర్ లలోని వ్యవస్థలు తట్టుకుని మనుగడ సాగించగలవా? అనేది తేలాల్సి ఉందని పేర్కొన్నారు. 

ఇప్పుడు చంద్రుడిపై సూర్యోదయం అయింది కాబట్టి, చంద్రయాన్-3 వ్యవస్థల్లో కదలిక వస్తే అవి శీతల వాతావరణాన్ని తట్టుకుని నిలబడినట్టు భావిస్తామని సోమ్ నాథ్ వివరించారు. సూర్యరశ్మిని గుర్తించి ల్యాండర్, రోవర్ మళ్లీ పని ప్రారంభించే ప్రక్రియ అంతా పూర్తి ఆటోమేటిగ్గా జరుగుతుందని వెల్లడించారు.
Chandrayaan-3
ISRO
Lander
Rover

More Telugu News