Chandrababu: కొనసాగుతున్న ఉత్కంఠ... చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు రేపటికి వాయిదా

  • రేపు ఉదయం పదిన్నరకు తీర్పు వెలువరిస్తామన్న న్యాయమూర్తి
  • ఇప్పటికే రెండుసార్లు వాయిదాపడిన చంద్రబాబు కస్టడీ పిటిషన్ తీర్పు 
  • కస్టడీ పిటిషన్‌పై బుధవారమే పూర్తయిన వాదనలు
Judgement on Chandrababu custody petition again postponed

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కస్టడీ పిటిషన్‌పై తీర్పు మరోసారి వాయిదా పడింది. రేపు (శుక్రవారం) ఉదయం గం.10.30 సమయానికి ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించనుంది. చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు వాయిదా పడటంతో అందరిలోను ఉత్కంఠ కనిపిస్తోంది. ఇది రిజర్వ్ తీర్పు కాబట్టి రేపు రావొచ్చు లేదా సోమవారం నాటికి రావొచ్చునని న్యాయనిపుణులు చెబుతున్నారు.

కస్టడీ పిటిషన్‌పై నిన్ననే వాదనలు ముగిశాయి. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి గురువారం (నేడు) ఉదయం తీర్పు వెలువరిస్తామని తెలిపారు. ఈ రోజు ఉదయం మళ్లీ సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా వేశారు. సాయంత్రం మరోసారి వాయిదా పడింది. రేపు తీర్పు చెబుతామని న్యాయమూర్తి తెలిపారు. చంద్రబాబు కస్టడీని కోరుతూ సీఐడీ... ఏసీబీ న్యాయస్థానంలో  పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మరిన్ని విషయాలు వెలికితీసేందుకు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ తరఫు న్యాయవాది కోరగా, సిట్ కార్యాలయంలో ఇప్పటికే విచారణ జరిపారని, రాజకీయ కక్షపూరిత కేసు కాబట్టి కస్టడీ అవసరం లేదని చంద్రబాబు తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

More Telugu News