Rajahmundry Central Jail: ఔను.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఒక ఖైదీ మృతి చెందాడు: జైళ్ల శాఖ డీఐజీ

  • డెంగీ కారణంగా సత్యనారాయణ అనే ఖైదీ మృతి చెందాడన్న డీఐజీ
  • దోపిడీ కేసులో ఈ నెల 6న జైలుకు వచ్చాడని వెల్లడి
  • దోమల నివారణ కోసం సంబంధిత అధికారులతో కలిసి చర్యలు చేపట్టామన్న డీఐజీ
One prisoner dead in Rajahmundry central jail

రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతపై ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అదే జైల్లో ఉన్న ఖైదీ గంజేటి వీర వెంకట సత్యనారాయణ మృతి చెందడం కలకలం రేపింది. ఖైదీ మృతిపై జైళ్ల శాఖ డీఐజీ, రాజమండ్రి సెంట్రల్ జైలు తాత్కాలిక సూపరింటెండెంట్ రవికిరణ్ స్పందించారు. దోపిడీ కేసులో ఈ నెల 6న సత్యనారాయణ జైలుకు వచ్చాడని ఆయన తెలిపారు. జ్వరంతో బాధపడుతున్న ఆయనను 7వ తేదీన రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని చెప్పారు. ప్లేట్ లెట్లు పడిపోవడంతో అత్యవసర చికిత్స కోసం ఈనెల 19న కాకినాడ జీజీహెచ్ కు తరలించామని తెలిపారు. డెంగీ కారణంగా నిన్న ఆయన మృతి చెందాడని వెల్లడించారు. 

జైల్లో దోమల నివారణ కోసం సంబంధిత శాఖతో కలిసి చర్యలు చేపట్టామని... ఫాగింగ్ చేస్తున్నామని రవికిరణ్ తెలిపారు. ఫాగింగ్ ఈరోజు కూడా చేస్తామని చెప్పారు. జైల్లో దోమల లార్వాల ఆనవాళ్లేమీ లేవని చెప్పారు. మరోవైపు జైల్లో ఖైదీ చనిపోవడంతో టీడీపీ యువనేత నారా లోకేశ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే రీతిలో తన తండ్రిని చంపేందుకు కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

More Telugu News