Republic Day: గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు.. బైడెన్‌ను ఆహ్వానించిన ప్రధాని మోదీ

  • జీ20 సమావేశాల్లోనే బైడెన్‌ను ఆహ్వానించిన మోదీ
  • చీఫ్ గెస్ట్‌గా వచ్చేందుకు బైడెన్ సుముఖత
  • తొలుత క్వాడ్ నేతలందరినీ ఆహ్వానించాలని భావించిన భారత్
  • కొందరు దేశాధినేతలు అందుబాటులో ఉండకపోవడంతో తుది నిర్ణయం
PM Narendra Modi invites US President Joe Biden as chief guest for Republic Day celebrations

భారత గతణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఈసారి అమెరికా అధ్యక్షుడు జో బైడన్ హాజరు కాబోతున్నారు. ఈ మేరకు భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 26న భారత్ నిర్వహించుకునే రిపబ్లిక్ డే వేడుకలకు జో బైడెన్‌ను భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆహ్వానించినట్టు ఆయన పేర్కొన్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన జీ20 సమావేశాల్లో భాగంగా జరిగిన ద్వైపాక్షి చర్చల సందర్భంగా ఈ ఆహ్వానం అందించినట్టు తెలిపారు.  

నిజానికి భారత రిపబ్లిక్ వేడుకలకు ‘క్వాడ్’ నేతలందరినీ ఆహ్వానించాలని భారత్ భావించినట్టు తొలుత వార్తలు వచ్చాయి. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బానీస్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా వంటివారు ఈ జాబితాలో ఉన్నారు. అయితే, ప్రపంచ నేతల అందుబాటును బట్టి తుది నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

భారత రిపబ్లిక్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు బైడెన్ అంగీకరించినట్టు కూడా తెలుస్తోంది. భారత్ గణతంత్ర వేడుకలు జరుపుకునే జనవరి 26నే ఆస్ట్రేలియా జాతీయ దినోత్సవం జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో అదే రోజు జరిగే క్వాడ్ నేతల సమావేశానికి కూడా ప్రధాని అల్బానీస్ హాజరు కావడం లేదని సమాచారం.

More Telugu News