Nandyala: ఆర్టీసీ కండక్టర్ ఆత్మహత్య.. చెరువులో వినాయకుడిని నిమ్మజ్జనం చేయాలంటూ సూసైడ్ నోట్

  • నంద్యాల పట్టణం సంజీవనగర్‌లో మంగళవారం వెలుగు చూసిన ఘటన
  • విధులకని ఇంట్లోంచి బయలుదేరిన ఆర్టీసీ కండక్టర్
  • ఆయన ఆఫీసుకు వెళ్లలేదని గుర్తించిన కుటుంబసభ్యులు
  • ఇంట్లోని కండక్టర్ లేఖ ఆధారంగా చెరువు వద్ద గాలించినా ఫలితం శూన్యం
  • మరుసటి రోజు చెరువులో తేలుతూ కనిపించిన కండక్టర్ మృతదేహం
RTC Conductor from Nandyala commits suicide by jumping into pond

వినాయకుడిని చెరువులో నిమజ్జనం చేయండంటూ ఓ ఆర్టీసీ కండక్టర్ సూసైడ్ లేఖలో రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన నంద్యాలలో తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పట్టణంలోని సంజీవనగర్‌కు చెందిన నరసింహులు ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నారు. రెండు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో ఆయన పక్కటెముకలకు గాయాలయ్యాయి. చికిత్స అనంతరం మళ్లీ విధుల్లో చేరారు. 

మంగళవారం విధులకని నరసింహులు ఇంటి నుంచి బయలుదేరారు. అదే సమయంలో ఉన్నతాధికారులను రెండు రోజుల సెలవు కోరుతూ లేఖ రాసి కుమారుడికి ఇచ్చి డిపోకు పంపించారు. అనంతరం, వినాయకుడిని చెరువులో నిమజ్జనం చేయాలంటూ మరో పేపరుపై రాసి పెట్టి, తన మొబైల్ ఫోన్‌ను ఇంట్లోనే వదిలి వెళ్లిపోయారు. ఆయన విధులకు వెళ్లలేదని గుర్తించిన కుటుంబసభ్యులు రోజంతా చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించి చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు, తన లేఖలో ఆయన చెరువు పదం కింద గీత గీయడం వారిని మరింత ఆందోళనకు గురి చేసింది. 

అటువైపు వెతికేందుకు వారు వెళ్లగా నరసింహులు అక్కడికి వచ్చినట్టు పర్యాటక సిబ్బంది తెలిపారు. చెరువు లోతు ఎంత ఉంటుందని అడిగినట్టు చెప్పారు. దీంతో, ఆ పరిసరాల్లో నరసింహులు కోసం ఆయన కుటుంబసభ్యులు గంటల తరబడి వెతికినా ఉపయోగం లేకపోయింది. బుధవారం ఉదయం ఆయన మృతదేహం చెరువులో తేలడంతో ఆ కుటుంబం తీవ్ర శోకసంద్రంలో కూరుకుపోయింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News