Vande Bharat Express: కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 24న ప్రారంభం

  • బెంగళూరు, హైదరాబాద్ మధ్య పరుగులు పెట్టనున్న కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందేభారత్ రైలు
  • ఈ నెల 24న వర్చువల్‌గా రైలును ప్రారంభించనున్న మోదీ
  • అదే రోజున విజయవాడ- చెన్నై వందేభారత్ రైలు ప్రారంభం
  • ఒకే రోజులో మొత్తం 9 రైళ్లను ప్రారంభించనున్న మోదీ
Modi to launch kachiguda yashwantpur vande bharat express on september 24

రైల్వే ప్రయాణికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ త్వరలో ప్రారంభం కానుంది.  హైదరాబాద్, బెంగళూరు మధ్య పరుగులు పెట్టే ఈ రైలును ప్రధాని మోదీ ఈ నెల 24న వర్చువల్‌గా పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. కాచిగూడ వేదికగా జరిగే ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే ఉన్నతాధికారులు పాల్గొంటారు. మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు ఈ రైలు బయలుదేరి.. మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం మీదుగా మధ్యాహ్నం రెండు గంటలకు యశ్వంత్‌పూర్‌కు (బెంగళూరు) చేరుకుంటుంది. తిరిగి 2.45కు యశ్వంత్‌పూర్‌ నుంచి బయలుదేరి రాత్రి 11.45కు కాచిగూడ చేరుకుంటుంది. 

ఆదివారం ప్రధాని మోదీ మొత్తం 9 వందేభారత్ రైళ్లను వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. వీటిల్లో విజయవాడ-చెన్నై వందేభారత్ కూడా ఉంది. విజయవాడలో ప్రారంభమయ్యే ఈ రైలు తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా చెన్నై సెంట్రల్‌కు చేరుకుంటుంది. గురువారం మినహా మిగతా రోజుల్లో ఈ రైలు అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. రోజూ ఉదయం 5.30 గంటలకు విజయవాడలో బయలుదేరి, మధ్యాహ్నం 12.10 గంటలకు చెన్నై చేరుకుంటుందని వివరించారు. తిరిగి చెన్నైలో మధ్యాహ్నం 3.20కి ప్రారంభమై రాత్రి 10 గంటలకు విజయవాడకు చేరుతుందని చెప్పారు.

More Telugu News