Asaduddin Owaisi: అందుకే మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశాం: అసదుద్దీన్ ఓవైసీ

  • రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన ఎంఐఎం ఎంపీలు  
  • మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ, ముస్లిం మహిళలకు స్థానం కోసం తాము పోరాడుతున్నామన్న ఓవైసీ
  • ఈ విషయాన్ని తెలియజేసేందుకు బిల్లును వ్యతిరేకించామని వెల్లడి
Owaisi speaks on why he his AIMIM MP opposed womens quota bill in Lok Sabha

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, మరో ఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్ ఇద్దరూ లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. ఈ కీలక బిల్లును వ్యతిరేకించిన ప్రతిపక్ష పార్టీల ఎంపీలు వీరిద్దరే కావడం విశేషం. దీనిపై అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ, ముస్లిం మహిళలకు స్థానం కోసం తాము పోరాడుతున్నామని పేర్కొన్నారు. 

‘‘భారత జనాభాలో ఓబీసీల సంఖ్య సగానికంటే ఎక్కువ. కానీ లోక్‌సభలో వారికున్న ప్రాతినిధ్యం కేవలం 22 శాతమే. ఇక భారత జనాభాలో ముస్లిం మహిళల వాటా 7 శాతం. కానీ లోక్‌సభలో ముస్లిం ఎంపీలు 0.7 శాతం మందే ఉన్నారు. మరి వారికి ఎందుకు ప్రాతినిధ్యం కల్పించరు?’’ అని ఆయన ప్రశ్నించారు. 

అంతకుమునుపు కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి మాట్లాడిన ఓవైసీ ఈ బిల్లు కేవలం ఉన్నత కులాల మహిళలకే రిజర్వేషన్ కల్పిస్తోందని చెప్పుకొచ్చారు. ‘‘ఎవరికోసమైతే బిల్లు తెస్తున్నారో వారికే బిల్లులో చోటు లేకపోతే ఎలా? బిల్లులో ఓబీసీ, ముస్లిం మహిళల ప్రాతినిధ్యం కోసం ఇద్దరు ఎంపీలే పోరాడారని వారికి తెలియజేసేందుకే బిల్లుకు వ్యతిరేకంగా ఓటువేశాం’’ అని అసదుద్దీన్ మీడియాకు చెప్పారు.

More Telugu News