Women Reservation bill: మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణం అమలు చేయకపోవడానికి కారణం ఇదే!

  • తక్షణం బిల్లును అమలు చేస్తే న్యాయపరమైన సవాళ్లు ఎదురవుతాయంటున్న ప్రభుత్వ వర్గాలు
  • మహిళలకు సీట్ల కేటాయింపులో తాజా జనాభా లెక్కలు అవసరమని వెల్లడి
  • ఇక 2026 తరువాత నియోజకవర్గ పునర్విభజనకూ అవకాశం ఉందంటున్న నిపుణులు 
  • నియోజకవర్గాల వారీగా తాజా జనాభా లెక్కల అధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని వెల్లడి
Why Womens Reservation Bill Cant Be Implemented Immediately

మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. రాజ్యసభ ఆమోదముద్ర, రాష్ట్రపతి సంతకం అనంతరం బిల్లు చట్టరూపం దాలుస్తుంది. అయితే, వచ్చే ఎన్నికల తరువాత కొత్త ప్రభుత్వం దీనిని అమల్లోకి తెస్తుందని హోం మంత్రి అమిత్ షా తెలిపారు. అయితే, ఈ చట్టాన్ని తక్షణం అమలు చేస్తే సరిపోతుంది కదా? 2010లో రాజ్యసభలో నిలిచిపోయిన బిల్లును ఎందుకు ముందుకు తీసుకెళ్లలేదు? అన్న ప్రశ్నలు అనేక మంది మదిలో మెదులుతున్నాయి. బిల్లును తక్షణం అమలు చేయాలని సోనియా గాంధీ కూడా డిమాండ్ చేశారు, బిల్లులో ఓబీసీ రిజర్వేషన్ విషయం కూడా తేల్చాలన్నారు. అయితే, ఈ ప్రశ్నలకూ ప్రభుత్వ వర్గాలే సమాధానం చెప్పాయి. 

బిల్లును తక్షణం అమలు చేసేందుకు ప్రయత్నిస్తే న్యాయపరమైన సవాళ్లు ఎదురవుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ వర్గాల ప్రకారం, కొత్త జనగణన, నియోజకవర్గ పునర్విభజన చేపట్టాకే మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వస్తుంది. 

‘‘ఓ సీటు మహిళలకు రిజర్వ్ చేయాలంటే దానికో ప్రాతిపదిక ఉండాలి. జనాభాకు సంబంధించి తాజాగా గణాంకాలు లేకుండా చేస్తే న్యాయపరమైన సవాళ్లు ఎదురవుతాయి. 2011లో చివరిసారిగా జనగణన చేపట్టారు. ఇక నియోజకవర్గాల పునర్విభజన కూడా అంతకుముందే జరిగింది. కరోనా కారణంగా 2021లో చేపట్టాల్సిన సెన్సెస్ వాయిదా పడింది’’ అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 

2024లో ఎన్నికల తరువాత ఏర్పడే కొత్త ప్రభుత్వం జనగణన చేపడుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక 2026 వరకూ నియోజకవర్గ పునర్విభజనపై నిషేధం ఉండటంతో ఆ తరువాత ఈ ప్రక్రియ కూడా మొదలవుతుందని అంటున్నాయి. ఇలా నియోజకవర్గాల వారీగా జనాభాలెక్కలు అందుబాటులోకి వచ్చాక ఎన్నికల సంఘం నియమావళిని అనుసరించి మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

నియోజకవర్గాల పునర్విభజన తరువాత పార్లమెంట్ల సీట్ల సంఖ్య పెరిగే అవకాశం వుంది. ఇదీ ఒకరకంగా లాభదాయకమేనని నిపుణులు చెబుతున్నారు. 1976 నుంచి పార్లమెంటు స్థానాల సంఖ్య 576గానే ఉందని, మరోవైపు జనాభా మాత్రం రెండున్నర రెట్లు పెరిగిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

More Telugu News