Chandrababu: చంద్రబాబు అరెస్ట్ తో టీడీపీకి భారీగా లబ్ధి.. వైసీపీ శ్రేణుల్లో కూడా కలవరం: సీ ఓటర్ సర్వేలో సంచలన విషయాలు

Chandrababu arrest will gain sympathy for TDP says CVoter survey
  • చంద్రబాబుకు సింపతీ పెరుగుతుందని అభిప్రాయపడ్డ 56 శాతం మంది
  • చంద్రబాబుకే మేలు జరుగుతుందని భావిస్తున్న 64 శాతం మంది వైసీపీ మద్దతుదారులు
  • బాబుకు సానుభూతి పెరుగుతుందని బీజేపీలో ప్రతి ఐదు మందిలో ముగ్గురి అభిప్రాయం
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసి, రిమాండ్ కు పంపించిన వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. బాబు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి రోజులు గడుస్తున్నా ఇంత వరకు ఆయనకు బెయిల్ రాలేదు. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ ఏపీలో ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపబోతోందనే విషయంపై సీఓటర్ చేసిన సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. 2024లో జరబోతున్న ఎన్నికల్లో చంద్రబాబు అరెస్ట్ టీడీపీకి భారీగా లబ్ధిని చేకూర్చబోతోందని సర్వేలో తేలింది. అరెస్ట్ అంశం చంద్రబాబుకు లాభిస్తుందని 56 శాతం మంది అభిప్రాయపడ్డారు. 

చంద్రబాబు అరెస్ట్ టీడీపీకి ఎంత వరకు లాభిస్తుందనే  విషయంపై అన్ని పార్టీల మద్దతుదారులను సీఓటర్ సంస్థ సర్వే చేసింది. అరెస్ట్ చంద్రబాబుకు లాభిస్తుందని టీడీపీ మద్దతుదారుల్లో 85 శాతం మంది చెప్పారు. వైసీపీ మద్దతుదారుల్లో కేవలం 36 శాతం మందే చంద్రబాబు జైలుకు వెళ్లడం జగన్ కు లాభిస్తుందని తెలిపారు. 64 శాతం మంది వైసీపీ మద్దతుదారులు చంద్రబాబు అరెస్ట్ టీడీపీకే లాభిస్తుందని అభిప్రాయపడ్డారు. అరెస్ట్ చంద్రబాబుకే మేలు చేస్తుందని బీజేపీ శ్రేణుల్లో ప్రతి ఐదు మందిలో ముగ్గురు తెలిపారు.  

సర్వేలో పాల్గొన్నవారిలో మెజారిటీ వ్యక్తులు అరెస్ట్ వల్ల చంద్రబాబుకు సింపతీ భారీగా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. చంద్రబాబుకు సానుభూతి పెరుగుతుందని 56 శాతం మంది తెలిపారు.

చంద్రబాబు అరెస్ట్ తర్వాత ప్రజల్లో వచ్చిన సానుభూతి వల్ల ముఖ్యమంత్రి జగన్ అభద్రతాభావానికి గురవుతున్నారా? అనే ప్రశ్నకు 58 శాతం మంది అవునని చెప్పారు. 30 శాతం మంది అభద్రతా భావంలో లేరని చెప్పగా... 12 శాతం మంది తెలియదు, చెప్పలేమని సమాధానమిచ్చారు. 

జగన్ అభద్రతాభావంలో ఉన్నారని 66.7 శాతం మంది బీజేపీ మద్దతుదారులు అభిప్రాయపడ్డారు. 86.7 శాతం మంది టీడీపీ, 37.5 శాతం మంది కాంగ్రెస్, 55.1 శాతం మంది ఇతర పార్టీల మద్దతుదారులు జగన్ అభద్రతాభావంలో ఉన్నారని చెప్పారు. తమ అధినేత జగన్ అభద్రతకు గురవుతున్నారని 36.3 శాతం మంది వైసీపీ వాళ్లు చెప్పగా... అలాంటిదేమీ లేదని 48.2 శాతం మంది తెలిపారు. 15.5 శాతం మంది వైసీపీ మద్దతుదారులు ఏమీ చెప్పలేమని అన్నారు.

 కాగా, ఈ సర్వేలో 1,809 మంది పాల్గొన్నారు.
Chandrababu
CVOTER
Survey
Andhra Pradesh
Telugudesam
Jagan
YSRCP

More Telugu News