Canada: కెనడాలో వేర్పాటువాద ఉగ్రవాదులపై చర్యలేవి..?

  • భారత వ్యతిరేక శక్తులకు అడ్డాగా మారుతున్న కెనడా
  • ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలంటూ పలుమార్లు విజ్ఞప్తి చేసిన భారత్
  • భారత ప్రభుత్వ విజ్ఞప్తులను పెడచెవిన పెట్టిన ట్రూడో సర్కారు
 Canada Ignored Indias Request To Extradite Terrorists

ఇండియా కెనడాల మధ్య ఖలిస్థానీ చిచ్చు ముదురుతోంది. కెనడాలోని జస్టిన్ ట్రూడో సర్కారు చర్యలను భారత ప్రభుత్వం తప్పుబడుతోంది. భారత వ్యతిరేక శక్తులకు కెనడా అడ్డాగా మారుతోందని, అక్కడి వేర్పాటువాద ఉగ్రవాదులపై ట్రూడో సర్కారు చర్యలు తీసుకోవడంలేదని ఆరోపిస్తోంది. కెనడాలో కనీసం తొమ్మిది వేర్పాటువాద ఉగ్ర సంస్థలు యాక్టివ్ గా ఉన్నాయని చెబుతోంది. భారత వ్యతిరేక ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలంటూ పలుమార్లు విజ్ఞప్తి చేసినా కెనడా పట్టనట్టు వ్యవహరిస్తోందని మండిపడుతోంది. తాజాగా కెనడా ప్రధాని ట్రూడో చేసిన వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య వివాదం మరింత ముదిరిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

దారుణ నేరాలకు పాల్పడిన ఈ వేర్పాటువాద ఉగ్రవాదులను ఇండియాకు అప్పగించాలని కోరినా ట్రూడో సర్కారు వినిపించుకోలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుుతున్నాయి. పంజాబీ సింగర్ సిద్దూ మూసేవాలా హత్యలోనూ ఈ వేర్పాటువాద ఉగ్రవాదుల హస్తం ఉందని ఆరోపిస్తున్నాయి. పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐతో కలిసి ఇండియాలో పలు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన టెర్రరిస్టులకు కెనడా ఆశ్రయం కల్పిస్తోందని విమర్శిస్తున్నాయి. మొత్తంగా 16 క్రిమినల్ కేసుల్లో నిందితుడు గ్యాంగ్ స్టర్ అర్షదీప్ సింగ్, సిద్దూ మూసేవాలాను హత్య చేసింది తామేనని బహిరంగంగా ప్రకటించుకున్న గోల్డీ బ్రార్ సహా పలువురు నేరస్థులను అప్పగించాలంటూ భారత ప్రభుత్వ అధికారులు కెనడాకు విజ్ఞప్తి చేశారు.

పలు నేరాల్లో వారి పాత్రకు సంబంధించిన ఆధారాలనూ సమర్పించారు. అయినప్పటికీ కెనడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ఆరోపిస్తున్నారు. వీరిద్దరితో పాటు భారత్ లో పలు నేరాలకు పాల్పడి వాంటెడ్ లిస్టులో ఉన్న గుర్వంత్ సింగ్ బాత్, భగత్ సింగ్ బ్రార్, మోనిందర్ సింగ్ బువాల్, సతీందర్ పాల్ సింగ్ గిల్ తదితరుల అప్పగింత విషయంలోనూ కెనడా చర్యలు తీసుకోవడంలేదని కేంద్ర ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.

More Telugu News