Almonds: బరువు తగ్గాలన్నా, పెరగాలన్నా ఇవి తింటే సరి!

  • బాదం పప్పుల వినియోగంపై తాజా అధ్యయనం
  • 106 మందికి బాదం పప్పుల డైట్ అందించిన పరిశోధకులు
  • డైటింగ్ సమయంలో శక్తిని కోల్పోకుండా బాదం పప్పులతో రక్షణ
  • ఇందులోని ఆరోగ్యకరమైన కొవ్వుతో బరువు పెరగొచ్చన్న నిపుణులు
More benefits with eating almonds

ఆరోగ్యానికి ఆరోగ్యం లభించాలన్నా, వయసుకు తగిన బరువుతో ఉండాలన్నా బాదం పప్పులను మించినవి లేవని ఓ తాజా అధ్యయనం వెల్లడించింది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని రీతిలో బరువు తగ్గాలంటే బాదం పప్పులే శ్రేష్ఠమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.  

డైటింగ్ చేస్తూ బరువు తగ్గే సమయంలో ఎలాంటి శక్తిని కోల్పోకుండా బాదం పప్పులు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయట. అదే సమయంలో బరువు పెరగాలనుకునేవారికి ఇందులోని ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయట. ఇతర శక్తినిచ్చే ఆహారంతో పాటు బాదం పప్పులను కూడా తీసుకుంటే కండరాలు పుష్టిగా తయారవుతాయని, తద్వారా ఆరోగ్యకరమైన బరువు సాధ్యమవుతుందని పరిశోధకులు తెలిపారు.

దక్షిణాస్ట్రేలియా యూనివర్సిటీ పరిశోధకులు బాదం పప్పుల వినియోగంపై ఓ అధ్యయనం నిర్వహించారు. బరువు తగ్గడంలో సాయపడడమే కాదు, వారి కార్డియోమెటాబాలిక్ ఆరోగ్యాన్ని కూడా బాదం పప్పులు పరిరక్షిస్తాయని గుర్తించారు. నిర్దిష్ట కాలపరిమితితో బాదం పప్పులు తిన్న వారు దాదాపు 7 కిలోల వరకు బరువు తగ్గారట. 

ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న డాక్టర్ షరాయా కార్టర్ అనే పరిశోధకురాలు దీనిపై స్పందించారు. బాదం పప్పులు మంచి స్నాక్ గా ఉపయోగపడతాయని వెల్లడించారు. వీటిలో ప్రొటీన్లు అత్యధికంగా ఉంటాయని, పీచు పదార్థం కూడా ఉంటుందని, విటమిన్లు, ఖనిజలవణాలు సమృద్ధిగా లభిస్తాయని వివరించారు. 

ఈ అధ్యయనం కోసం మొత్తం 106 మందిని ఎంచుకున్నారు. వారికి 9 నెలల పాటు క్రమం తప్పకుండా బాదం పప్పులు అందించారు. ఆ తొమ్మిది నెలల్లో 3 నెలల పాటు ఎనర్జీ రెస్ట్రిక్టెడ్ డైట్ అమలు చేశారు. మరో 6 నెలల పాటు ఎనర్జీ కంట్రోల్డ్ డైట్ అమలు చేశారు. దీర్ఘకాలంలో బాదం పప్పులు వారి ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపించాయని గుర్తించారు. 

ఇక, బాదం పప్పులు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్నది తెలిసిందే. అప్పటికే పలు అధ్యయనాలు దీన్ని నిరూపించాయి. ఇవి ఎల్డీఎల్ (చెడు) కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. 

కాగా, అమెరికా వ్యవసాయ విభాగం (యూఎస్ డీఏ) పేర్కొన్న వివరాల ప్రకారం... 100 గ్రాముల బాదం పప్పు ద్వారా 580 కెలోరీల శక్తి లభిస్తుంది... 21.15 గ్రాముల ప్రొటీన్, 50 గ్రాముల కొవ్వు, 21.55 గ్రాముల కార్బోహైడ్రేట్, 12.5 గ్రాముల ఫైబర్, 4.35 గ్రాముల చక్కెర లభిస్తాయట. అంతేకాదు, బాదం పప్పుల్లో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, విటమిన్-ఈ మెండుగా ఉంటాయి.

More Telugu News