mla rajasingh: బీజేపీ నేతలు జోకర్లు కాదు.. హీరోలంటూ కేటీఆర్‌‌కు రాజాసింగ్ కౌంటర్

MLA Raja Singh counters KTR over his comments on BJP leaders
  • తెలంగాణలో చర్చనీయాంశమైన ’రజాకార్‌‌’ సినిమా
  • రాష్ట్రంలో మతహింసను ప్రేరేపించేందుకు కొందరు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపణ
  • తనతో కలిసి సినిమా చూసిన తర్వాతే మాట్లాడాలన్న ఎమ్మెల్యే రాజా సింగ్
టాలీవుడ్‌ కొత్త సినిమా ‘రజాకార్‌‌’ అటు తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేకెత్తించేలా ఉంది. యాటా సత్యనారాయణ దరకత్వంలో.. గూడూరు నారాయణ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం టీజర్‌‌ ఇప్పటికే చర్చనీయాంశమైంది. 1947లో దేశం మొత్తానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత హైదరాబాద్ సంస్థానంలో నిజాం పాలనలో రజాకార్లు చేసిన హింసాకాండ, దౌర్జన్యాల నేపథ్యంలో సినిమా తెరకెక్కింది. ప్రధానంగా హిందువులందరినీ ఇస్లాం మతంలోకి మార్పించి ముస్లిం రాజ్యంగా మార్చాలన్న లక్ష్యంతో రజాకార్లు చేసిన క్రూరచర్యలను తెరకెక్కించినట్టుగా టీజర్లు చూపించారు. బ్రాహ్మణుల యజ్ఞోపవీతాలను తెంపేయటం, తెలుగు మాట్లాడేవారి నాలుకలు కోసేయటం, ఇస్లాం మతంలోకి చేరని వాళ్లను మూకుమ్మడిగా ఉరి తీయటం లాంటి ఘోరాలను కూడా టీజర్‌లో చూపించారు.

 ఈ చిత్రంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌కు స్పందనగా రాష్ట్రంలో తమ రాజకీయ ప్రచారం కోసం మతహింసను ప్రేరేపించేందుకు బీజేపీకి చెందిన కొంతమంది యత్నిస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలో శాంతి భద్రతలు దెబ్బతినకుండా సినిమా విషయమై సెన్సార్‌‌ బోర్డుతో పాటు పోలీసుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. దీనిపై గోషామహల్ ఎమ్మెల్యే  రాజసింగ్ స్పందించారు. మంత్రి కేటీఆర్‌కు నిజాం పాలన గురించిన చరిత్ర తెలియదన్నారు. తన తండ్రి‌ కేసీఆర్‌ను అడిగి కేటీఆర్.. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అరాచకాల గురించి తెలుసుకోవాలన్నారు. తనతో కలిసి మంత్రి కేటీఆర్ ఈ సినిమా చూడటానికి రావాలని కోరారు. సినిమా చూశాకే మంత్రి కేటీఆర్ మాట్లాడాలన్నారు. బీజేపీ నేతలు జోకర్లు కాదని హీరోలని రాజాసింగ్ పేర్కొన్నారు.
mla rajasingh
bjp
KTR
rajakar movie
KCR
brs

More Telugu News